సంచలనంగా మారిన జియా ఖాన్ అనుమానాస్పద మరణంపై సీబీఐ కోర్టు సంచలన తీర్పును ఇచ్చేసింది. ఈ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు సూరజ్ పంచోలీ నిర్దోషిగా పేర్కొంటూ సీబీఐ కోర్టు తీర్పును ఇచ్చేసింది. అదెలా? అన్న ప్రశ్నలకు సరైన ఆధారాలు లేవని కోర్టు సమాధానం ఇచ్చింది. జియా ఖాన్ విషయానికి వెళితే.. అతి తక్కువ సమయంలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న బాలీవుడ్ నటి జియాఖాన్.
తన సినిమాలతో యూత్ అటెన్షన్ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్న ఆమె ఒక సంచలనంగా చెప్పాలి. అలాంటి జియాఖాన్ అనూహ్యంగా మరణించటం అప్పట్లో షాకింగ్ గా మారింది. ఆత్మహత్య అని కొందరు కాదు హత్య అని మరికొందరు వాదనలు చోటు చేసుకున్నాయి. న్యూయార్కులో పెట్టి పెరిగిన ఇంగ్లిష్ అమెరికన్ నటిగా జియా ఖాన్ అలియాస్ నఫిసా రిజ్వి ఖాన్ సుపరిచితులు.
ఆమె చేసింది మూడు సినిమాలే అయినా.. ఆమె బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ తో నటించిన నిశబ్ద్ మూవీతో సన్సేషన్ గా మారారు. పాతికేళ్ల వయసులో ఆమె 2013 జూన్ లో ముంబయిలోని జూహులో ఉన్న తన ఇంట్లో ఆమె విగతజీవిగా కనిపించారు. అయితే.. ఆమె డెడ్ బాడీ వద్ద లభించిన ఆరుపేజీల లేఖ ఆధారంగా నటుడు సూరజ్ పంచోలిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. జియాఖాన్ ను ఆత్మహత్యకు ప్రేరేపించారన్న అభియోగం అతడి మీద మోపారు.
ఆదిత్యా పంచోలీ కొడుకే సూరజ్ పంచోలీ. జియాతో డేటింగ్ చేశారన్న ప్రచారంతో పాటు 2012 నుంచి వారిద్దరి రిలేషన్ లో ఉన్నట్లు చెప్పేవారు. అయితే.. జియా తల్లి మాత్రం తన కుమార్తె ఆత్మహత్య చేసుకోదని.. ఆమెది కచ్ఛితంగా హత్యేనని వాదిస్తారు. జియాను శారీరకంగా.. మానసికంగా సూరజ్ ఎంతో హింసించినట్లుగా పేర్కొన్నారు. అతడితో నరకం అనుభవించిన తన కుమార్తె ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆరోపిస్తారు.
2013లో తన కుమార్తె అనుమానాస్పద మరణంపై సీబీఐ దర్యాప్తుకోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
దీంతో.. సానుకూలంగా స్పందించినకోర్టు.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో 2014లో బాంబే పోలీసుల నుంచి ఈ కేసును సీబీఐ టేకోవర్ చేసింది. అయితే.. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయటంతో విచారణ తమ పరిధిలోకి రాదంటూ 2021లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి ముంబయి సెషన్స్ కోర్టు బదిలీ చేసింది. తనపై వచ్చిన ఆరోపణల్ని సూరజ్ ఖండిస్తున్నారు. తనకు ఏ పాపం తెలీదని చెబుతున్నాడు. తాజాగా తీర్పు ఇచ్చిన కోర్టు.. సరైన ఆధారాలు లేని కారణంగా పంచోలీని నిర్దోషిగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది.