వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెచ్చిపోయారు. ఏకంగా డ్యూటీలోనే ఉన్న ఒక ఇన్ స్పెక్టర్‌ను ఆమె లాగి పెట్టి కొట్టారు. దీంతో ఒక్కసారిగా లోటస్ పాండ్‌లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అంతేకా దు.. పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లోనూ కలకలం రేగింది. కొన్నాళ్లు సర్కారుకు వ్యతిరకంగా ఉద్యమిస్తున్న షర్మిల.. సోమవారం కూడా నిరసనకు పిలుపునిచ్చారు.
టీఎస్ పీఎస్సీ పరీక్ష పేపర్ లీకేజీ, ఈ కేసులో వేసిన విచారణ కమిటీ.. ఏం చేస్తోందని రెండు రోజులుగా ఆమె ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కొండను తొవ్వి ఎలుకను పట్టుకున్న చందంగా సాగుతోందని విమర్శించారు. అదేసమయంలో సీఎం కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని కూడా ఆమె ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్‌కు కూడా దీనిలో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.
ఈ క్రమంలోనే సోమవారం.. ప్రగతి భవన్ వద్ద నిరసన తెలిపేందుకు ఆమె ప్లాన్ చేసుకున్నారు. దీంతో సో మవారం ఉదయాన్నే పోలీసులు లోటస్ పాండ్‌లోని షర్మిల ఇంటికి చేరుకున్నారు. ఆమెను హౌస్ అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇదేసమయంలో ఆమె డైవర్‌ను కారులో నుంచి బయటకు దింపేశారు. దీంతో ఒక్కసారిగా పోలీసులపై కి దూసుకువచ్చిన షర్మిల.. సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి చెంప ఛెళ్లు మనిపించారు.
ఎందుకయ్యా మా డ్రైవర్‌ను కొట్టావు? అని ఆమె నిలదీయడంతో పోలీసు కూడా అంతే స్వరంతో నీకేంటి సంబంధం అని ప్రశ్నించాడు. దీంతో ఇరువురి మధ్య కొద్ది సేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంతలో రెండు సార్లు షర్మిల ఇన్ స్పెక్టర్పై చేయి చేసుకోవడం.. సంచలనంగా మారింది. డ్యూటీలో ఉన్న అధికారిపై చేయి చేసుకున్న షర్మిల విషయంలో విమర్శలు వస్తున్నాయి. చట్టానికి సహకరించాల్సిన బాధ్యత లేదా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.