ఏపీ డిప్యూటీ సీఎం, దళిత నేత నారాయణ స్వామి నోరెలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన గతంలో ఎలా నోరుజారారో.. ఎలా కవర్ చేసుకునేవారో ఆ ఉదాహరణలన్నీ చెప్పాలంటే చాంతాడంత లిస్టవుతుంది. అయితే.. విచిత్రంగా నారాయణస్వామికి రానున్న ఎన్నికలకు కొత్త సమస్య మొదలైంది. ఎవరికైనా అన్నదమ్ములతోనో.. నమ్మకంగా తిరుగుతూ సమయం చూసి దెబ్బేసే అనుచరులతోనే రాజకీయంగా ఇబ్బందులొచ్చిన సందర్భాలున్నాయి కానీ నారాయణ స్వామికి మాత్రం అనూహ్యంగా సొంత మేనళ్లుల్లతో సమస్య వచ్చిపడింది. ఇంతకాలం నారాయణస్వామి వెన్నంటే తిరిగిన మేనళ్లుల్లు ఇప్పుడు సొంత కుంపటి పెట్టి మామకు బదులు తమకే టికెట్ ఇవ్వాలంటూ పార్టీపై ఒత్తిడి పెంచుతున్నారట. అంతేకాదు.. నారాయణ స్వామి వైరి వర్గం నేతలందరినీ సొంత పార్టీ, విపక్ష పార్టీ అన్న తేడా లేకుండా కలుస్తూ నారాయణస్వామికి నిద్ర లేకుండా చేస్తున్నారట.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామిని ప్రజలు నిలదీస్తుంటే, మరోవైపు సొంత మేనల్లుళ్లే ఆయనకు చెక్ పెడుతున్నారు. ఆ యన మేనల్లుళ్లు ఆర్.సుబ్రహ్మణ్యం, రమేశ్ ఇటీవలవరకు నారాయణ స్వామికి వ్యక్తిగత కార్యదర్శులుగా పని చేశారు. అయితే ఇటీవల కాలంలో వారిద్దరిని నారాయణ స్వామి తొలగించారు. దీంతో నారాయణస్వామి పట్ల తన ఇద్దరు మేనల్లుళ్లు అసంతృప్తితో ఉన్నారు. అంతేకాదు స్థానిక నాయకులను పర్సనల్‌గా కలవడమే పనిగా పెట్టుకున్నారు. నారాయణస్వామి బద్ధశత్రువుగా భావించే మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు, ఎన్ఆర్ఐ జ్ఞానేంద్రరెడ్డిని కలిసి శాలువా కప్పారు.
శనివారం పాలసముద్రం మండలంలోని ఎంపీపీ శ్యామల భర్త శివప్రకాశ్రాజును కలిశారు. వైస్‌ఎంపీపీ శేఖర్ని, పార్టీ మాజీ మండలాధ్యక్షుడు సుబ్రహ్మణ్యంరెడ్డి, జడ్పీటీసీ అన్భు, సర్పంచ్ భాస్కర్‌రెడ్డి, కేశవరెడ్డి తదితరులను కలసి మద్దతు కోరారని తెలిసింది. గంగాధరనెల్లూరు మండలంలో సీనియర్ నాయకులు వేల్కూరు బాబురెడ్డి, మరి కొందరిని కలిశారు. వెదురుకుప్పం మండలంలో బొమ్మయ్యపల్లె ఎంపీటీసీ కొత్తపల్లి భాస్కర్ని కలిశారు. అసంతృప్త నేతలందరినీ ఒక్క తాటిమీదకు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
అక్కడితో ఆగకుండా వైసీపీలో జగన్ దగ్గర చక్రంతిప్పే జిల్లాకు చెందిన ‘పెద్ద’ నేతను కలిశారని… వచ్చే ఎన్నికలలో గంగాధర నెల్లూరు టికెట్ తమ మామకు కాకుండా తనకు ఇప్పించాలని సుబ్రహ్మణ్యం కోరగా.. అందుకు రమేశ్ కూడా మద్దతు పలికారని చెప్తున్నారు. అందుకు ఆ పెద్ద నేత కూడా తలూపారని టాక్. నారాయణ స్వామి మేనల్లుళ్లే ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తుండటం అక్కడి రాజకీయాలలో చర్చనీయంగా మారింది. మేనల్లుళ్ల దెబ్బకు నారాయణ స్వామి కూడా కంగారుపడుతున్నారని టాక్. సుబ్రహ్మణ్యం, రమేశ్‌లు పట్టు పెంచుకోకముందే వారికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో నారాయణస్వామి త్వరలోనే జగన్‌ను కలిసి విషయం చెప్పడానికి రెడీ అవుతున్నారంటున్నారు.