విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చాలని అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆ యూనివర్సిటీ విజయవాడకు రావడానికి తీవ్ర కృషి చేసిన అన్నగారి పేరును తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడంపై టీడీపీ నేతలు మండిపడ్డారు. ఎన్టీఆర్ పేరు తొలగింపును టీడీపీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.
చంద్రబాబు, టీడీపీ నేతలు, నందమూరి కుటుంబ సభ్యులతోపాటు ఆఖరికి వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల కూడా ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే జగన్ సర్కార్ కు నేషనల్ మెడికల్ కమిషన్ మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్(MARB) షాక్ ఇచ్చింది. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, విజయవాడ) పేరు మారలేదని స్పష్టం చేసింది.
నంద్యాలలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలకు 150 ఎంబిబిఎస్ సీట్లు మంజూరు చేస్తూ తాజాగా జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొనడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కింద ఏర్పాటు అయిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, అధ్యాపకులు ఇతర వస్తువులకు సంబంధించిన అనుమతులు ఇస్తున్న సందర్భంగా ఈ విషయం వెల్లడైంది. 2023-24 విద్యాసంవత్సరానికి గాను 150 ఎంబిబిఎస్ సీట్లకు అనుమతినిస్తూ ఎంఏఆర్ బి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో పేరు మార్పు వ్యవహారంలో జగన్ కు షాక్ తగిలినట్లయింది.