ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై జరిగిన దాడి ముమ్మాటికీ హత్యాయత్నమేనని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు.
శనివారం ఢిల్లీలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, చంద్రబాబు పర్యటనను లక్ష్యంగా చేసుకుని స్వయానా రాష్ట్ర కేబినెట్ మంత్రి ఆదిమూలపు సురేశ్ దాడులకు కుట్ర పన్నారని ఆరోపించారు.
మార్కాపురం సభను ముగించుకుని ఎర్రగొండపాలెం వస్తున్న చంద్రబాబు నాయుడుకు నలుపు రంగు బెలూన్లు, జెండాలతో అడ్డుతగలడంతో పాటు రాళ్లతో దాడికి పాల్పడ్డారని అన్నారు.
ఈ దాడులను స్వయానా కేబినెట్ మంత్రి హోదాలో ఉన్న ఆదిమూలపు సురేశ్ పర్యవేక్షించారని, దాడులకు పాల్పడ్డవారికి పోలీసులు భద్రత కల్పించారని మండిపడ్డారు.
వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఈ తరహా దాడులకు పథక రచన చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య పోలీసులకు ముందుగానే చెప్పి, తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినప్పటికీ పట్టించుకోలేదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ‘జెడ్ ప్లస్’ కేటగిరీ భద్రత కల్గిన వ్యక్తి చంద్రబాబు నాయుడుకు ఎన్ఎస్జీ కమెండోలు భద్రత కల్పిస్తున్నారని, రాళ్ల దాడి జరిగినప్పుడు ఆయన గాయపడకుండా ఉండడం కోసం తమ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను కమెండోలు అడ్డుపెట్టాల్సి వచ్చిందని అన్నారు.
ఈ క్రమంలో కమెండో సంతోష్ కుమార్ తలకు రాయి తగిలి గాయపడ్డారని తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు చేసిన ఈ పని హత్యాయత్నం నేరంతో సమానమని, వారిపై ఆ మేరకు కేసులు నమోదు చేయాలని కనకమేడల డిమాండ్ చేశారు.
ఎన్ఎస్జీ కమెండో తలకు గాయమైన తర్వాత పోలీసులు స్పందించినట్టు నటిస్తూ దాడులకు పాల్పడ్డ వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఏమీ అనకుండా తెలుగుదేశం కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని లాఠీచార్జి చేశారని కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు.
దళితుల పేరుతో ఉద్యమాన్ని నిర్మిస్తున్నానని చెబుతున్న మంత్రి ఆదిమూపలపు సురేశ్ బజారుకొచ్చి, చొక్కాలు చించుకుని సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేశారని అన్నారు.
ఒక అధికారిగా పనిచేసి ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో ఉన్న వ్యక్తి ఇంత సంస్కారహీనంగా ప్రవర్తిస్తారని అనుకోలేదన్నారు. అలాంటి వ్యక్తిని ఇంకా కేబినెట్లో ఎందుకు ఉంచుతున్నారో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.
లేదంటే వఈ దాడుల వెనుక ముఖ్యమంత్రి హస్తం కూడా ఉందని భావించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.