ఏపీ సీఎం జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. అబద్దాలు చెప్పి.. ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారంటూ నిప్పులు చెరిగారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు మర్చిపోయాడని, జాబ్ క్యాలెండర్ ఊసే లేదని మండిపడ్డారు. అవినీతిని ప్రశ్నించే వారిపై పోలీసు జులుం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా గిద్దలూరులో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు.
సాయంత్రం 6గంటలకు ప్రారంభమైన రోడ్ షో 2 కిలో మీటర్ల లోపు దూరం చేరడానికి సుమారు 3 గంటలకు పైగా పట్టింది. గాంధీబొమ్మ సెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు నిర్వహించిన ఈ రోడ్ షోలో కార్యకర్తలు, స్థానికులు పెద్దఎత్తున పాల్గొన్నారు. రోడ్ షోలో సౌండ్ సిస్టం వాహనాన్ని అడ్డుకునేందుకు పోలీసుల యత్నం చేయగా చంద్రబాబు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రాత్రి 10 గంటల సమయంలో చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో నిత్యావసరాల ధరలకు తోడు ఇసుక, కరెంటు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా అవినీతి, దోపిడీ కొనసాగుతోందని, ఐదుగురు సభ్యులు ఉన్న ప్రతీ కుటుంబంపై రూ.10 లక్షల భారం ఈ ప్రభుత్వం మోపిందన్నారు. ఉద్యోగులు, పోలీసులకు సమయానికి జీతాలు రావడం లేదని, ఒకటో తేదీన జీతం ఇస్తే చాలనే స్థితికి ఉద్యోగులు వచ్చారని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం వెలిగొండ పూర్తి చేసుంటే గిద్దలూరు ప్రాంతం సస్యశ్యామలం అయ్యేదని చంద్రబాబు అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వెలిగొండకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేస్తామని తెలిపారు. తమ హయాంలో పోలవరం 72 శాతం పూర్తి చేశామని గుర్తు చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి.. అధికారంలోకి రాక ముందు జాబ్ క్యాలెండర్ అని ఓట్లు వేయించుకుని ఇప్పుడు ఆ ఊసే లేకుండా చేశారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.