ఎక్కడైనా ఒక కన్ను ఇంకో కన్నును పొడుస్తుందా? అంటూ సూటిగా అడిగిన ప్రశ్నకు వెంటనే సమాదానం చెప్పటం కష్టం. కానీ.. కాలంతో పాటు చోటు చేసుకునే పరిణామాల్ని చూసినప్పుడు.. అప్పుడప్పుడు.. చాలా అరుదైన సందర్భాల్లో ఒక కన్ను మరో కన్నును పొడిచే అవకాశం ఉందన్న విషయం మాజీ మంత్రి వివేకా హత్య కేసు స్పష్టం చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక కన్ను మరో కన్నును పొడిచినప్పుడు లేని ఇబ్బంది.. విపక్ష నేతను బాధితురాలు న్యాయం కోసం సంప్రదిస్తే తప్పు ఎలా అవుతుంది? అన్నది ప్రాథమికమైన ప్రశ్న.
వివేకా హత్య కేసులో కుమార్తె సునీతను ఉద్దేశించి అవినాశ్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు.. హత్యకు మించిన డ్యామేజ్ ను చేస్తున్నాయన్న విషయాన్ని మర్చిపోతున్నారు. వివేకా ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ఆయన ముస్లిం మహిళను రెండో పెళ్లి చేసుకున్నారని.. వారికో కొడుకు ఉన్నారని.. వారి ఆస్తి తగదాల నేపథ్యంలో హత్య జరిగినట్లుగా చెప్పటం ఒక ఎత్తు అయితే.. వివేకాకు ఇద్దరు ముగ్గురితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆరోపించటం ఏమిటి?
ఇలాంటి మాటల్ని అవినాశ్ నోటి నుంచి వస్తున్న వేళ.. ముఖ్యమంత్రి జగన్ ఎందుకు ఆయన్ను నిలువరించకూడదు. నిజమే.. తన మీద హత్య లాంటి తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు.. తాను నిర్దోషినని నిరూపించుకోవటం తప్పేం కాదు. కానీ.. ఆ పేరుతో చనిపోయి.. తిరిగి రాలేని.. తన వాదనను వినిపించుకోలేని వివేకా క్యారెక్టర్ మీద దారుణమైన వ్యాఖ్యల్ని చేయటం ఎంతవరకు సబబు? అన్నది ప్రశ్న.
ఇలా జరగకూడని ఎన్నో జరిగిపోతున్న వేళ.. న్యాయం జరగటం ఆలస్యమవుతుందన్న ఉద్దేశంతో పలువురిని కలుస్తున్న వివేకా కుమార్తె సునీతమ్మ.. విపక్ష నేత చంద్రబాబుతో భేటీ కావటం తప్పేమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజంగానే ఈ కేసు లెక్క తేల్చాలన్నదే ఉద్దేశమైతే.. రెండు వారాల్లో తేలిపోదా? అన్న మాట ఏపీలోని ప్రతి గల్లీలోనూ వినిపిస్తుందని చెబుతున్నారు. ఒక కన్ను మరో కన్నును పొడిచే అవకాశం ఉన్న అరుదైన సందర్భంలో సునీతమ్మ విపక్ష నేత చంద్రబాబును కలవటంలో తప్పేమీ లేదన్న మాట రాజకీయ వర్గాల్లోనే కాదు.. తెలుగు ప్రజల నోటి నుంచి వినిపిస్తోంది. ఈ మాటల్ని అవినాశ్ లాంటి వాళ్లు వింటే మంచిది.