ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా దూకుడును ప్రదర్శిస్తుంటారు. ఆయన పలుసందర్భాల్లో చెప్పిన కొత్త జిల్లాల ఏర్పాటు మాత్రం వాస్తవ రూపం దాల్చటం లేదు. ఆ మాటకు వస్తే ఆయన చాలా పెద్ద హామీలేవీ అమలుకాలేదు.
ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటు కోసం చాలానే కసరత్తు చేసినా.. అవేమీ వర్కువుట్ కావట్లేదు. ఎందుకని కొత్త జిల్లాల్ని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతోందన్న సందేహానికి సమాధానం లభించటం లేదు.
ఇలాంటివేళ.. తాజాగా సమాచార హక్కు కార్యకర్త ఒకరు చేసిన ప్రయత్నం.. ఈ అంశానికి సంబంధించిన నిజాన్ని బయటకు వచ్చేలా చేసింది.
2021లో జనాభా లెక్కల ప్రాతిపదికన కొత్త జిల్లాలు.. కొత్త మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇదే ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుకు అడ్డుగా మారినట్లుచెబుతున్నారు. సామాజిక కార్యకర్త రవికుమార్ చేసిన దరఖాస్తుతో ఈ విషయాన్ని వెల్లడించారు.
కొత్త జనాభా లెక్కలు పూర్తి అయ్యే వరకు జిల్లా.. మండల.. గ్రామ.. రెవెన్యూ పరిధిలో ఎలాంటి మార్పులు చేయొద్దని కేంద్రం ఆదేశించింది. దేశ వ్యాప్తంగా జనాభా లేక్కలు పూర్తి అయ్యే వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుంది.
అప్పటివరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు అవకాశం లేదంటున్నారు. దీంతో.. కొత్త జిల్లాల ఏర్పాటు ఏడాదిన్నరకు పైనే సమయం తీసుకుంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి మరో కారణం.. కరోనా కారణంగా జనాభా లెక్కల్ని సేకరించే కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపేశారు. దీంతో.. జగన్ చెప్పిన కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పట్లో సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు.