జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడేమి మాట్లాడుతారో తనకు తెలీదు. ఈమధ్యనే తెలంగాణా మంత్రి హరీష్ రావుకు ఏపీ మంత్రులకు మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. మాటలయుద్ధం జరిగి ముగిసిపోయింది కూడా. పవన్ కు ఇపుడే మెలకువ వచ్చినట్లుంది. అందుకనే ఏపీ మంత్రులను తప్పుపడుతు ఒక వీడియో రిలీజ్ చేశారు. వ్యక్తులను విమర్శించాలి తప్ప తెలంగాణా ప్రజలను, సమాజాన్ని అవమానించకూడదని వార్నింగ్ ఇచ్చారు.
పైగా తెలంగాణా సమాజాన్ని కించపరిచిన మంత్రులు తెలంగాణాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ కూడా చేశారు. మంత్రుల మాటలు తనను చాలా బాధించిందని, వైసీపీ నేతలు నోళ్ళు అదుపులో పెట్టుకోవాలంటు ఘాటుగా చెప్పారు. విచిత్రం ఏమిటంటే అసలు వివాదం మొదలైందే హరీష్ నుండి. హరీష్ కు బుద్ధిచెప్పే ధైర్యం పవన్ కు ఎలాగు లేదు. అలాంటపుడు ముగిసిన వివాదాన్ని పవన్ కెలుక్కోవటం ఎందుకు. విషయం తెలుసుకోకుండా ఏపీ మంత్రులను తప్పుపట్టడం ఏమిటో అర్ధంకావటంలేదు.
ఏ సందర్భంలో హరీష్ అన్నారో తెలీదు అన్నపుడు వివాదం జోలికి వెళ్ళకుండా ఉండటమే పవన్ కు గౌరవంగా ఉంటుంది. ఏమీ తెలీదంటూనే ఏపీ మంత్రులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయటంలో అర్ధమేంటి ? బహుశా తెలంగాణా ఎన్నికల్లో పోటీచేయాలని డిసైడ్ అయ్యారు కదా. అందుకనే ఓట్లకోసం ఏపీ మంత్రులను తక్కువచేసి మాట్లాడితే తెలంగాణాలో ఓట్లుపడతాయేమోనని పవన్ ఆలోచించుంటారు.
లేకపోతే విషయం తెలుసుకోకుండానే తెలంగాణాకు మద్దతుగా మాట్లాడరు. వివాదానికి కారణమైన మంత్రి హరీష్ రావును తప్పుపడితే ఏపీలో నాలుగు ఓట్లు వస్తాయేమో. అంతేకానీ విషయం తెలియకుండానే ఏపీని వ్యతిరేకిస్తు తెలంగాణాకు సపోర్టుచేసినంత మాత్రాన తెలంగాణాలో ఓట్లుపడతాయా ? ఏమిటో పవన్ తనలోని అజ్ఞానాన్ని తానే బయటపెట్టుకుంటున్నారు. వీడియోలో కూడా స్పష్టంగా చెప్పారు హరీష్ ఏ సందర్భంగా ఏమన్నారో తెలీదని. పైగా ఏపీ మంత్రులు డైరెక్టుగా హరీష్ ను టార్గెట్ చేశారే కానీ తెలంగాణా ప్రజలను ఒక్కమాట కూడా ఏమీ అనలేదు. అయినా పవన్ ఏపీ మంత్రులను తప్పుపడుతున్నారంటే ఇక ఆయన స్ధాయిని ఏమనుకోవాలి.