ఈ మధ్యకాలంలో ఆధార్ వేలిముద్రలతో సరికొత్త సైబర్ క్రైం ఒకటి వెలుగులోకి వచ్చింది. మనకు తెలియకుండానే, మన మొబైల్ కు ఓటీపీ కూడా రాకుండానే మన బ్యాంకు ఖాతాలోనుంచి ఒక రోజుకు కనీసం 10 వేల రూపాయలు దొంగతనం చేసే హైటెక్ దొంగల ముఠా ఒకటి తయారైంది. ఓటీపీ రాకపోవడం ఈ దొంగతనంలో మొదటి ట్విస్ట్ అయితే…మన ఖాతాలో నుంచి డబ్బులు కట్ అయినట్లు కూడా బ్యాంకు ఖాతాకు లింక్ అయిన ఫోన్ కు మెసేజ్ కూడా రాకపోవడం ఈ దొంగతనంలో రెండో ట్విస్ట్.
మీకు మీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ డైలీ చెక్ చేసుకునే అలవాటుంటే…ఒక 10 వేల నష్టంతో బయటపడే చాన్స్ ఉంది. లేదంటే…వరుసగా రోజుకు 10 వేల చొప్పున ఖాతాలో ఉన్న డబ్బును బట్టి…దొంగతనం జరుగుతోందని తెలుసుకోవడంలో జరిగిన జాప్యాన్ని బట్టి లక్షలు కోల్పోయిన బాధితులున్నారు. మన దేశంలో చాలాపనులకు ఆధారమైన ‘ఆధార్’ కార్డును అడ్డుపెట్లుకొని ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్లు. మనకు తెలీకుండా మన వేలిముద్ర ఎలా వేస్తారు? ఇదేమన్నా సినిమానా? అంటే సినిమా కాదుగానీ, సినీ ఫక్కీలోనే ఈ నేరం చేస్తున్నారీ ఘరానా మోసగాళ్లు.
డిజిటల్ లావాదేవీలు…కూరగాయలు కోసుకునే పదునైన కత్తి వంటివి. కూరగాయలు కోసుకోవడానికి కొందరు వాడితే…పీకలు కోయడానికి మరికొందరు వాడుతున్నారు. మీ దగ్గర డబ్బులు, ఏటీఎం కార్డు లేని సమయాల్లో… మీ ఆధార్ నంబర్ నే అకౌంట్ నెంబర్ గా…మీ వేలిముద్రనే పాస్ వర్డ్ గా మార్చి ఒక రోజుకు రూ.10-20 వేలు మీ బ్యాంకు ఖాతా నుంచి విత్ డ్రా చేసుకునే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఎఇపిఎస్)
సౌలభ్యాన్ని ఆర్బీఐ కల్పించింది. దేశవ్యాప్తంగా పలు బీసీ పాయింట్లు, కస్టమర్ సర్వీస్ సెంటర్లు(సీఎస్ సీ) వంటివి ఈ సేవలు అందిస్తున్నాయి. కానీ, ఇదే డిజిటల్లు…దీని స్టైలే వేరు…అంటూ కొందరు పోరగాళ్లు డీజే టిల్లు పాటను మాడిఫై చేసి మరీ ఆ సౌలభ్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
బీసీ పాయింట్లు కొత్త సిమ్ కార్డు, ఏపీలో అయితే రేషన్ తీసుకునేందుకు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో…ఇలా రకరకాల అవసరాల కోసం మన ఆధార్ కార్డు, వేలి ముద్రలు ఇవ్వాల్సి ఉంటుంది. అసలు ఆధార్ కోసం ఫొటో, ఐరిష్, వేలిముద్రలిచ్చినపుడే మన వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోందని చాలామంది గగ్గోలు పెట్టినా పలితం లేకపోయింది. దాని మూల్యం ఇపుడు చెల్లించుకోవాల్సి వస్తోంది. కొందరు కేటుగాళ్లు మన వేలిముద్రలు-ఆధార్ నంబర్ ఉన్న డేటాను డూప్లికేట్ చేసి మనకు తెలీకుండానే మన బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు.
బ్యాంకు ఆ హైటెక్ దీనికి బ్యాంకు అధికారులు, సైబర్ నిపుణులు సూచించే తక్షణ పరిష్కారాలు రెండు.
ఒకటి…మీ ఆధార్ కార్డు జిరాక్స్ కు బదులు…మాస్క్ డ్ ఆధార్(Masked Aadhar Card) వాడడం. మాస్క్ డ్ ఆధార్ లో చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయి.
రెండు..స్టార్ట్ ఫోన్ లో ఎంఆధార్ (maadhar app) యాప్ డౌన్ లోడ్ చేసుకొని అందులో మీ బయోమెట్రిక్ (వేలి ముద్రలు) లాక్ చేసుకోవడం.
ఫీచర్ ఫోన్ ఉన్నవారు కూడా ఎస్ఎంఎస్ ద్వారా లేదంటే uidai.gov.in వెబ్ సైట్ ద్వారా బయోమెట్రిక్ లాక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా అవసరం ఉండి వేలిముద్ర వేయాల్సి వస్తే బయోమెట్రిక్ అన్ లాక్ చేసుకున్న తర్వాతే మీ వేలిముద్రను బయోమెట్రిక్ పరికరం అంగీకరిస్తుంటి. maadhar app ద్వారా బయోమెట్రిక్ అన్ లాక్ చేసుకోవచ్చు. ఓటీపీ ప్రక్రియ పూర్తయిన తర్వాత 10 నిమిషాల పాటు బయోమెట్రిక్ అన్ లాక్ అవుతుంది. ఆ తర్వాత ఆటోమెటిక్ గా లాక్ అవుతుంది. అంటే ఈ 10 నిమిషాలలోపే మీరు వేలి ముద్ర వేయాలి. లేకుంటే మరోసారి ఓటీపీ ప్రక్రియ పూర్తి చేసి మరో 10 నిమిషాల సమయం అరువు తెచ్చుకోవాలి.