ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య సన్నిహిత సంబంధాలున్నట్లే భావిస్తారు అందరూ. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబులా.. కేసీఆర్‌తో ఎప్పుడూ ఘర్షణ వైఖరికి దిగలేదు జగన్. వారి మధ్య లోపాయకారీ ఒప్పందం ఉందని.. ఒకరికొకరు రాజకీయంగా సహకరించుకుంటారని.. కేసీఆర్ మెప్పు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో కూడా జగన్ రాజీ పడతాడని కూడా ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. కానీ ఈ మధ్య వైసీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఎన్నడూ లేని విధంగా ఘర్షణ నెలకొంటోంది.
ముఖ్యంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి లేమి గురించి బీఆర్ఎస్ నేతలు తరచుగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఏపీలో అభివృద్ధి లేదని, తెలంగాణలో ఉండే ఏపీ వాళ్లంతా తమ ఓట్లను ఇక్కడికి మార్చుకోవాలని మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. దీనికి కౌంటర్‌గా ఏపీ మంత్రులు తీవ్ర వ్యాఖ్యలే చేశారు.
కాగా ఏపీ మంత్రులకు రివర్స్ కౌంటరిస్తూ ఓవైపు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే.. మరోవైపు బీఆర్ఎస్ అనుకూల పత్రిక నమస్తే తెలంగాణ జగన్ సర్కారు పరువు తీసేలా ఒక కథనం ప్రచురించింది. తెలంగాణ అభివృద్ధిలో పరుగులు పెడుతుండగా.. ఏపీ ఎలా వెనుకబడుతోందో చూపిస్తూ ఫొటోలతో ఉన్నమాట అంటే ఉలుకెందుకు పేరుతో సచిత్ర కథనం ఇచ్చింది.
ఓవైపు పోలవరం పడకేస్తే.. కాళేశ్వరం ఎలా కళకళలాడుతోందో చూపించడమే కాక.. ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు, నీటి వసతి.. ఇలా రకరకాల విషయాల్లో తెలంగాణకు, ఏపీకి మధ్య తేడాను కళ్లకు కట్టినట్లు చూపించారు ఈ కథనంలో. ఈ స్టోరీ జగన్ సర్కారుకు కచ్చితంగా చికాకు పెట్టించేదే. జగన్ మిత్రుడైన కేసీఆర్‌కు చెందిన పత్రిక ఇలా ఎటాక్ చేయడం.. ఏపీ ప్రభుత్వ పరువు తీసేయడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది.