ఏపీ సీఎం జగన్ పై హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని బాలకృష్ణ దుయ్యబట్టారు. పాలనలో జగన్ సర్కార్ విఫలమైందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బాలకృష్ణ అన్నారు. అభివృద్ధి శూన్యం, పన్నులు ఘనం అనే రీతిలో జగన్ పాలన సాగుతోందని దుయ్యబట్టారు. నవరత్నాల కోసం వేల కోట్ల రూపాయలు అప్పు చేశారని, అది కట్టాల్సింది రాష్ట్ర ప్రజలేనని బాలకృష్ణ అన్నారు.
జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఆ అప్పు తీర్చడానికి పన్నుల మీద పన్నులు వేసి జనం నడ్డి విరగ్గొడతారని బాలకృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జరిగేది ఇదేనని, నవరత్నాల మాయలో పడి ప్రజలు తమను తాము మోసం చేసుకోవద్దని బాలయ్య చేతులెత్తి దండం పెట్టారు. జగన్ మళ్ళీ వస్తే ఏపీ మరో శ్రీలంక అవుతుందని, ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. మళ్లీ సైకోకు ఓటు వేసి అధికారం అప్పగిస్తే తెలుగు ప్రజలంతా రాష్ట్రం వదిలి పారిపోవాల్సిందేనని బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజలకు ఉన్న ఆయుధం ఓటు మాత్రమేనని, రాబోయే ఎన్నికల్లో ప్రస్తుత పరిస్థితులను గమనించి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. క్షణికావేశంలో కులం రొచ్చులో పడి నవరత్నాలను చూసి ఓటు వేయొద్దని, భవిష్యత్తును చూసి ఓటు వేయాలని బాలయ్య బాబు అన్నారు. లోకేష్ పాదయాత్రకు విపరీతమైన స్పందన వస్తోందని, అది చూసి చాలా ఆనందంగా ఉందని అన్నారు.
గతంలో జనం బయటకు వచ్చేందుకు భయపడ్డారని, కానీ ఇప్పుడు ధైర్యంగా ప్రజలందరూ యువగళం పాదయాత్రలో లోకేష్ వెంట నడుస్తున్నారని అన్నారు. చైనా కన్నా మన దేశంలో యువత ఇప్పుడు ఎక్కువ ఉన్నారని, ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఎదగడానికి మనకు మంచి అవకాశం ఉందని అన్నారు. తనను అన్ని కులాల వారు మతాలవారు ఆదరిస్తారని చెప్పారు.