ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని ఆరోపణలను, విచారణను ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవితను సుకేష్ చంద్రశేఖరన్ మరింతగా ఇరికించేస్తున్నట్లే ఉన్నాడు. దాదాపు వారంరోజుల క్రితం తాను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పినట్లుగా హైదరాబాద్ లోని బీఆర్ఎస్ ఆఫీసులో రు. 15 కోట్లు అందించినట్లు చెప్పిన విషయం సంచలనంగా మారింది. పార్టీ ఆఫీసులో పార్క్ చేసుంచిన రేంజి రోవర్ కారులో ఏపీ అనే వ్యక్తికి రు. 15 కోట్లను అందించినట్లు చెప్పాడు.
సుకేష్ చెప్పిన వివరాల ప్రకారం ఏపీ అనే వ్యక్తి ఎవరు, రేంజిరోవర్ కారు ఓనర్ ఎవరు ? ఆ కారును వాడుతున్నది ఎవరు ? అనే విషయమై ఆరాలు మొదలయ్యాయి. ఏపీ అంటే అరుణ్ రామచంద్ర పిళ్ళై అనే ప్రచారం పెరిగిపోయింది. దాంతో కారు, ఓనర్, వాడుతున్నదెవరు అనేది తేలాల్సుంది. అయితే తాజాగా అంటే గురువారం విడుదల చేసిన లేఖలో ఇంకొన్ని వివరాలను క్లియర్ గానే చెప్పాడు. తాజాగా చెప్పిన వివరాలు ఏమిటంటే తన పీఏ ఏపీకి మొత్తం డబ్బు అందించాలని బీఆర్ఎస్ నేత చెప్పారట.
6060 నెంబర్ గల కారు మీద ఎంఎల్సీ అనే స్టిక్కర్ కూడా అతికించున్నట్లు సుకేష్ తాజాగా హింటిచ్చాడు. సదరు నేత ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణను ఎదుర్కొంటున్నట్లు చెప్పాడు. దాంతో సుకేష్ చెప్పింది ఎవరిగురించో అందరికీ అర్ధమైపోయుంటుంది. సదరు నేతకు తనకు మధ్య జరిగిన మొబైల్ వాట్సప్ ఛాటింగ్ స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయని చెప్పటం మరింత కలకలం సృష్టిస్తోంది.
స్క్రీన్ షాట్లున్నాయని చెప్పటమంటే సదరు నేతను సుకేష్ బెదిరిస్తున్నాడా ? బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా అన్నది అర్ధంకావటంలేదు. సీబీఐ, ఈడీ అడిగితే తమ మధ్య జరిగిన 703 వాట్సప్ చాట్ల స్క్రీన్ షాట్లను ఇస్తానని బంపర్ ఆపర్ కూడా సుకేష్ ఇచ్చాడు. మొత్తానికి కవితతో పాటు బీఆర్ఎస్ కొంప కూల్చాలని సుకేష్ చూస్తున్నాడా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.