అన్నగారు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక.. నిర్వహించిన సభలకు భారీ ఎత్తున ప్రజలు పోటెత్తేవారు. ఆయనను చూసేందుకు.. ఆయన మాట వినేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చేవారు. దీంతో వారిని చూసిన అన్నగారు ఎన్టీఆర్.. `నింగి వంగిందా.. నేల ఈనిందా!` అని వ్యాఖ్యానించేవారు. అచ్చం అలానే.. ప్రస్తుతం యువ నాయకుడు.. టీడీపీ మాజీ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగ ళం పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోంది.
జనవరి 27న పాదయాత్ర ప్రారంభించిన యువగళం పాదయాత్రపై అనేక సందేహాలను.. విమర్శలను పటాపంచలు చేస్తూ.. ప్రజలు హారతులు పడుతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ ఘనస్వాగ తాలు పలుకుతున్నారు. ఇప్పటి వరకు 700 కిలోమీటర్ల పాదయాత్రను నారా లోకేష్ పూర్తి చేసుకుని మరో మైలురాయిని తన ఖాతాలో వేసుకున్నారు. పాదయాత్రకు జనస్పందన ఏవిధంగా ఉంటుందోనని ఆదిలో పార్టీ నాయకులు ఒకింత ఖంగారు పడ్డారు.
అయితే.. ఇంతింతై.. అన్నచందంగా.. నారా లోకేష్ దూకుడు పెంచడం.. ప్రజల్లోనూ చైతన్యం రావడం, ప్రభుత్వ వ్యతిరేకత పెల్లుబుకుతున్న నేపథ్యంలో పాదయాత్రకు అపూర్వ స్పందన వస్తోంది. తాజాగా 61వ రోజు ఉరవకొండలో యువగళం పాదయాత్రలో ప్రభంజనం కనిపించింది. లోకేష్‌కు మద్దతుగా, ఆయన వెంట నడిచేందుకు వేలాదిగా తరలివచ్చిన ప్రజలతో ఉరవకొండ వీధులు కిక్కిరిసాయి. పాదయాత్రలోనూ, బహిరంగ సభలోనూ శ్రేణులు అదే ఉత్సాహం కనబరిచాయి. గత 61రోజులుగా సాగుతున్న యువగళం పాదయాత్రలో ఉరవకొండ స్పందన హైలైట్ అని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
తప్పిన ప్రమాదం..!
ఉరవకొండ నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్న నారా లోకేశ్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కూడేరులో క్రేన్ నుంచి భారీ గజమాల తెగి లోకేష్‌పై పడింది. దీంతో ఒక్కసారిగా వేలాది మంది అభిమానులు లోకేష్ వద్దకు రావడంతో తోపులాట చోటు చేసుకుంది. తృటిలో ప్రమాదం తప్పడంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.