టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పార్టీ, పార్టీ అగ్రనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. లోకేష్ పాదయాత్రలో పాల్గొనేందుకు జనం పోటెత్తుతున్నారు. లోకేష్ అడుగులో అడుగు వేస్తూ సైకో పాలన పోవాలి సైకిల్ పాలన రావాలి అంటూ నినదిస్తున్నారు. ఈ క్రమంలోనే లోకేష్ పాదయాత్ర తాజాగా అనంతపురంలో కొనసాగుతున్న సందర్భంగా అక్కడ బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సభా ప్రాంగణమంతా ఇసుకేస్తే రాలనంత మంది జనంతో కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా జగన్ పై లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. యువత దెబ్బకు సింగిల్ సింహం అహంకారం నేలకు దిగిందని, అసలు సినిమా ముందుందని లోకేష్ అన్నారు. తప్పుడు కేసులు పెట్టమని 151 సీట్లతో జనం గెలిపించారా అని జగన్ ను లోకేష్ ప్రశ్నించారు. అప్పు తీర్చలేదు అన్న నెపంతో బీసీ మహిళను వివస్త్రను చేసి వేధిస్తారా అంటూ మండిపడ్డారు.
తాము అధికారంలోకి రాగానే బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తామని చెప్పారు. వ్యవసాయ మోటర్ లకు మీటర్లు పెడితే వాటిని పగలగొట్టాలని, ఆ తర్వాత తాము చూసుకుంటామని లోకేష్ రైతులకు పిలుపునిచ్చారు. జగన్ రాజారెడ్డి రాజ్యాంగం పవర్…చూపిస్తున్నాడని కానీ తాను అంబేద్కర్ రాజ్యాంగం పవర్ ఏమిటో చూపిస్తానని లోకేష్ ఛాలెంజ్ చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను పురుగుల కన్నా హీనంగా చూసిన ఘనత జగన్ దేనిని ఎద్దేవా చేశారు.
కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ రివర్స్ అయిందని, మీ సీట్లు మీకే ఇస్తా…పార్టీని, నన్ను వదిలి వెళ్ళకండి అంటూ జగన్ బ్రతిమాలుకుంటున్నాడని సెటైర్లు వేశారు. ఇక, వాలంటీర్లతో జగన్ కొత్త గోబెల్స్ ప్రచారానికి తెర తీశారని, టిడిపి గెలిస్తే సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ఆపేస్తారని ప్రచారం చేస్తున్నారని లోకేష్ విరుచుకుపడ్డారు. బ్రదర్ జగన్ సంక్షేమాన్ని రాష్ట్రానికి పరిచయం చేసింది టిడిపి అని, సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన హిస్టరీ నీదని పంచ్ డైలాగ్ చెప్పారు.