ప్రపంచానికి పెద్దన్నలా వ్యవహరిస్తున్న అమెరికా చరిత్రలో తొలిసారిగా ఈ తరహా షాకింగ్ ఘటన జరిగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టు కావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. 2016 నాటి హష్ మనీ కేసులో ట్రంప్ ను అరెస్ట్ చేశారు. ట్రంప్ పై ఆ కేసుకు సంబంధించి మొత్తం 34 అభియోగాలు నమోదు కాగా మాన్హాటన్ కోర్టులో ట్రంప్ స్వయంగా లొంగిపోయారు. ఆ వెంటనే ట్రంప్ ను అధీనంలోకి తీసుకున్న పోలీసులు… జడ్జి ఎదుట ట్రంప్ ను హాజరుపరిచారు.
అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్నప్పటి నుంచి ట్రంప్ పై పలు సంచలన ఆరోపణలు, విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. 2006లో ఓ హోటల్లో ట్రంప్ తనతో శృంగారంలో పాల్గొన్నాడని పోర్న్ స్టార్ స్టార్ మీ డేనియల్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే, 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ఈ విషయాన్ని వెల్లడించకుండా ఉండేందుకు భారీ మొత్తంలో ఆమెకు ట్రంప్ డబ్బులు ఇచ్చినట్టుగా ఆరోపణలు వచ్చాయి.
తన అడ్వకేట్ కోహెన్ ద్వారా 1.3 లక్షల డాలర్లను దేనియల్ కు ట్రంప్ ఇచ్చారని ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించింది. కోహెన్ కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. అయితే, 1.3 లక్షల డాలర్లను ట్రంప్ చెల్లించడం టెక్నికల్ గా పెద్ద నేరం కాకపోయినప్పటికీ ఆ చెల్లించిన డబ్బు సేకరించిన విధానం అమెరికా చట్టాల ప్రకారం నేరపూరితమైనది కావడంతో ట్రంప్ మెడకు ఈ కేసు చుట్టుకుందని తెలుస్తోంది.
ఇక, మాజీ అధ్యక్షుడు అయిన ట్రంప్ ను అరెస్ట్ చేసినప్పటికీ ఆయన హోదా కారణంగా చేతికి బేడీలు వేయలేదని స్థానిక మీడియా చెబుతోంది. ఇక, డేనియల్ ను తాను కలిసిన మాట వాస్తవమేనని, కానీ ఆమెతో తనకు లైంగిక సంబంధాలు లేవని కోర్టులో ట్రంప్ తన వాదనలు వినిపించారు. ఈ విషయంలో తనను దోషిగా ప్రకటించవద్దని కోరారు. ఏదేమైనా అమెరికా చరిత్రలో తొలిసారిగా మాజీ అధ్యక్షుడు అరెస్టు కావడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.