మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో ఆ సంస్థ చైర్మన్ రామోజీరావును, శైలజా కిరణ్ ను ఏపీ సిఐడి అధికారులు నిన్న విచారణ జరిపిన సంగతి తెలిసిందే. దాంతోపాటు మార్గదర్శి చిట్ ఫండ్స్ కు సంబంధించిన 30 మంది మేనేజర్లకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే, రామాజీరావు అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఆయనను గంటల తరబడి విచారణ జరిపిన తీరు సర్వత్రా విమర్శలకు తావిచ్చింది.
ఈ నేపథ్యంలోనే ఏపీ సిఐడి విచారణను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పలువురు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ పిటిషన్లను విచారణ జరిపిన హైకోర్టు ఏపీ సిఐడికి షాక్ ఇచ్చింది. 30 మంది మేనేజర్లపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ సిఐడిని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మరోవైపు, ఈ కేసు విచారణపై సీనియర్ పొలిటిషన్ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
జగన్ అయినా రామోజీరావు అయినా ఆరోపణలు వస్తే విచారణ ఎదుర్కొనక తప్పదని ఉండవల్లి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను అందరికీ లాభాలు ఇచ్చానని గతంలో జగన్ తనతో చెప్పిన విషయాన్ని ఉండవల్లి గుర్తు చేసుకున్నారు. 100 కోట్లు పెట్టుబడులు పెట్టిన వారికి 150 కోట్లు ఇచ్చానని 200 కోట్లు పెట్టిన వారికి 250 కోట్లు ఇచ్చానని చెప్పారని, కావాలంటే లెక్కలు చూపిస్తాను అని కూడా తనతో జగన్ అన్నారని గుర్తు చేసుకున్నారు. ఒకరోజు ఎయిర్ పోర్టులో కనిపిస్తే ఆ విధంగా చెప్పినట్టుగా గుర్తుచేసుకున్నారు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని ఉండవల్లి అన్నారు.