పులివెందుల పేరు చెప్పగానే ఏపీ మాజీ సీఎం దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం గుర్తుకువస్తుంది. వైయస్సార్ తండ్రి వైయస్ రాజారెడ్డి మొదలుకొని సీఎం జగన్ వరకు పులివెందులతో ప్రత్యేక అనుబంధం ఉంది. వైఎస్ 1978 నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా,4సార్లు ఎంపీగా, రెండుసార్లు ముఖ్యమంత్రిగా, వివేకా రెండుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్సీగా, విజయమ్మ ఒకసారి ఎమ్మెల్యేగా అవినాష్ రెడ్డి రెండుసార్లు ఎంపీగా, జగన్ ఒకసారి ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
45 ఏళ్లుగా ప్రతిసారి ఎన్నికలలో భారీ మెజారిటీతో వైయస్ కుటుంబం నుంచి వైయస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తూ వస్తున్నారు.వాస్తవానికి అయితే ఇన్నిసార్లు ఈ రకంగా తమ కుటుంబ సభ్యులను తాము బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తూ వచ్చిన పులివెందుల ప్రజలకు పులివెందుల నియోజకవర్గానికి వైయస్ కుటుంబం ఎంతో చేసి ఉంటుందని జనం అంతా అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉంది.
పులివెందుల పులిబిడ్డ వైఎస్సార్ అంటూ వైఎస్ కుటుంబ గొప్పదనం పాటల వరకే పరిమితం అయింది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తమకు తమ విజయాలకు ఎన్నికలలో తమ అప్రతహిత జైత్రయాత్రను కొనసాగించేందుకు మద్దతు తెలిపిన పులివెందుల ప్రజలకు మాత్రం వైఎస్ కుటుంబం రిక్త హస్తాలే చూపించింది. గత 40 సంవత్సరాలుగా వైఎస్ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులకు ఆ కుటుంబం కనీసం ఒక బస్టాండ్ కట్టించలేకపోయింది అంటే ఎవరు నమ్మరు.
నమ్మినా నమ్మక పోయినా అదే నిజం. ఈ వ్యవహారంపై కొద్ది రోజులుగా ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నా సరే జగన్ కు మాత్రం చీమకుట్టినట్టు లేదు. తాటాకులు, తడికలు. రేకుల షెడ్లు అడ్డుపెట్టి అదే బస్టాండ్ అని నిస్సిగ్గుగా చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు జగన్. తమ కుటుంబానికి ఇంత చేసిన పులివెందులకు కనీసం బస్టాండ్ కట్టించలేని వైఎస్ కుటుంబం చంద్రబాబు పై మాత్రం బురదజల్లేందుకు రెడీగా ఉంటుంది.
చంద్రబాబు సీఎం అయిన తెల్లారే రాజధాని కట్టేయాలని ఆయన కట్టలేక పోయారు కాబట్టి ఆయనకు పాలన చేతకాదని అభాండాలు వేస్తూ వస్తుంది వైసీపీ. ఇడుపులపాయలు తన తండ్రి సమాధికి 27 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిన జగన్ బస్టాండ్ కోసం మాత్రం 27 లక్షలు కూడా ఖర్చు పెట్టలేకపోయారు. బస్టాండ్ కట్టలేని జగన్ మూడు రాజధానులు కట్టి ప్రజలను పరిపాలిస్తానని చెప్పడం నిజంగా హాస్యాస్పదం.
ఒకప్పుడు నీ బతుకు బస్టాండ్ అని సెటైర్లు వేసేవాళ్ళు. కానీ పులివెందుల ప్రజలపై ఆ జోకు వేసే అవకాశం లేకుండా అక్కడ బస్టాండ్ కూడా లేదు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.