తొందరలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి. ఈ మధ్యనే సీ ఓటర్ రిలీజ్ చేసిన ప్రీ పోల్ సర్వేల్లో కాంగ్రెస్ పార్టీకి 127 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తేల్చింది. 224 సీట్ల అసెంబ్లీలో 127 సీట్లంటే కంఫర్టబుల్ మెజారిటి అనే చెప్పాలి. 2018లో సింగిల్ లార్జెస్టు పార్టీగా రావటం, జేడీఎస్ తో పొత్తు పెట్టుకోవటం, జేడీఎస్ అధినేత కుమారస్వామికి సీఎం పీఠం అప్పగించటం, బీజేపీ కూల్చేయటం లాంటి గొడవలు ఉండవేమో.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాష్ట్రంతో పాటు కేంద్రంలో కూడా అధికారంలో ఉండటం బీజేపీకి కాస్త అనుకూలించే అంశమనటంలో సందేహంలేదు. సరే ఈ విషయాలను పక్కనపెట్టేస్తే బీజేపీకి మరో పెద్ద సమస్య ఎదురుకావటం తథ్యమన్నట్లుగా ఉంది. అదేమిటంటే గాలి జనార్ధనరెడ్డి రూపంలో పెద్ద గండం పొంచి ఉందనే అనిపిస్తోంది. కర్నాటకలో గాలి సోదరులు ఎంత పవర్ ఫుల్లో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేసులు, అరెస్టులు, జైళ్ళు ఎన్ని సమస్యలు ఉన్నా గాలి సోదరులు పవర్ ఫుల్లనే చెప్పాలి.
అలాంటి గాలి జనార్ధనరెడ్డి సొంతంగా పార్టీ పెట్టుకుని అభ్యర్ధులను రంగంలోకి దింపుతున్నారు. కర్నాటక-ఏపీ సరిహద్దుల్లోని జిల్లాల్లో అభ్యర్ధులను ఇప్పటికే ఫైనల్ చేసేశారు. బళ్ళారి, చిక్ బళాపూర్, కోలారు, తుముకూరు జిల్లాల్లో సుమారు 70 నియోజకవర్గాల్లో అభ్యర్ధులు పోటీచేయబోతున్నారు. వీళ్ళందరికీ ఆర్ధికపరమైన అండదండలు గాలి నుండి దక్కుతుందనటంలో సందేహంలేదు.
ఇపుడు పోటీచేయబోతున్న వాళ్ళంతా ప్రధానంగా బీజేపీనే దెబ్బ కొట్టబోతున్నారు. ఎందుకంటే గాలి తరపున పోటీకి దిగుతున్న వాళ్ళల్లో అత్యధికులు బీజేపీలో నుండి బయటకు వచ్చిన వాళ్ళే. కాబట్టి వాళ్ళ నేతలు, క్యాడర్ అంతా బీజేపీ వాళ్ళే అనటంలో సందేహంలేదు. కాబట్టే బీజేపీకి గాలి దెబ్బ తప్పదనే ప్రచారం మొదలైపోయింది. పరిపాలనలో బీజేపీ అన్నీవిధాలుగా ఫెయిలైందనే చెప్పాలి. ఇద్దరు సీఎంలు మారటం, మంత్రులపై అవినీతి ఆరోపణలు, పాలనపై బీజేపీ పట్టుజారిపోవటం లాంటి అనేక కారణాలతో జనాలంతా మండిపోతున్నారట. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.