మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసు…కొద్ది నెలల క్రితం వరకు ఈ కేసు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే సంచలనం రేపింది. అయితే, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు మూడుసార్లు హాజరు కావడం, అంతకుముందు ఈ కేసు విచారణ ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ కావడంతో జాతీయ స్థాయిలోనూ ఈ కేసుపై చర్చ తీవ్ర స్థాయికి చేరుకుంది.
ఇక, ఈ కేసును ఇన్నాళ్లుగా విచారణ జరుపుతున్న సిబిఐ తరఫు విచారణ అధికారి రాంసింగ్ ను తప్పించాలంటూ ఈ కేసులో నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపి సంచలన నిర్ణయం తీసుకుంది. వివేకా కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కొత్త సిట్ ను సీబీఐ ఏర్పాటు చేసి ఆ ప్రతిపాదనలను సుప్రీంకోర్టు ముందు ఉంచింది.
ఈ క్రమంలోనే సీబీఐ దాఖలు చేసిన నివేదికను పరిగణలోకి తీసుకున్నామని దేశపు అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. సీబీఐ డిఐజి కేఆర్ చౌరాసియా నేతృత్వంలో కొత్త సిట్ ఏర్పాటైంది. వివేక హత్య కేసు దర్యాప్తు నుంచి ప్రస్తుత విచారణ అధికారి రామ్ సింగ్ ను తప్పించినట్టు సుప్రీంకోర్టుకు సీబీఐ వెల్లడించింది. ఇక, శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలంటూ తులసమ్మ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఏప్రిల్ 30వ తేదీ లోపు వివేకా హత్య కేసు దర్యాప్తు ముగించాలని సీబీఐకి సుప్రీంకోర్టు తాజా డెడ్ లైన్ విధించింది. ఈ కేసులో విస్తృత కుట్ర కోణాన్ని అత్యంత వేగంగా బయట పెట్టాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వేగంగా దర్యాప్తు చేపట్టాలని గతంలోనూ సుప్రీంకోర్టు ఆదేశించిన విషయాన్ని తాజాగా మరోసారి సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది.
ఇక, తులసమ్మ పిటిషన్ పై స్పందిస్తూ…6 నెలల లోపు ట్రయల్ మొదలుకాకపోతే శివ శంకర్ రెడ్డి సాధారణ బెయిల్ పిటిషన్ కు అవకాశం ఉంటుందని, అప్పుడు దాఖలు చేసుకోవచ్చని తులసమ్మకు సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది.