అది 1982 మార్చి 29వ తేదీ….హైదరాబాదులోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో వేలాది మంది జనం తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు… విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు ఆరోజు తాను పెట్టబోతున్న రాజకీయ పార్టీ పేరును ప్రకటించబోతున్నారని తెలిసి వేలాదిమంది అక్కడికి తరలివచ్చారు. ఢిల్లీ గద్దెపై కూర్చున్న ఉత్తరాది నేతల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసేందుకు తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పేందుకే ప్రాంతీయ పార్టీ ( టీడీపీ ) పెడుతున్నానని అన్నగారు ప్రకటించారు.
తనకోసం వచ్చిన వేలాదిమంది అభిమానుల ముందుకు వచ్చిన అన్నగారు తన లాల్చీ జేబులో నుంచి ఒక చిన్న చీటీని బయటకు తీశారు. ఆ చీటీలో అప్పటికే తన పార్టీ పేరును అన్నగారు రాసుకొని వచ్చారు. తన పార్టీ కోసం, తన కోసం, తెలుగు జాతి ఆత్మగౌరవం కాపాడేందుకు వచ్చిన వేలాదిమంది ప్రజల ముందు తన పార్టీ పేరు ‘‘తెలుగుదేశం’’ అంటూ అన్నగారు ప్రకటించిన ఘట్టం తెలుగుజాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఆ రకంగా ‘‘సమాజమే దేవాలయం…ప్రజలే దేవుళ్ళు’’ అనే నినాదంతో సరిగ్గా 41 ఏళ్ల క్రితం నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు టీడీపీ పోరాడుతూనే ఉంది. ప్రతి అడుగూ ప్రజల కోసం వేస్తూ రాష్ట్ర ప్రగతి కోసం మన తెలుగుదేశం అంటూ తెలుగువారి ఆత్మగౌరవ నినాదాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది టీడీపీ.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే సర్వానికి అధినేతలు అన్న ఎన్టీఆర్ నినాదాన్ని ఎలుగెత్తి చాటుతూ ఆయన అడుగుజాడల్లో చంద్రబాబు నేటికీ నడుస్తున్నారు. పాలకులు అంటే ప్రజలకు సేవకులు మాత్రమే అని, ప్రజలకు మేలు చేసే ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు ఎవరికీ భయపడకుండా తీసుకోవాలని అన్నగారు సూచించిన మార్గంలో చంద్రబాబు నడుస్తున్నారు.
ఈ రోజు తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ సభను హైదరాబాదులో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ వేదిక వద్దకు టిడిపి అధినేత చంద్రబాబు చేరుకున్నారు. అంతకుముందు, ఎన్టీఆర్ ఘాట్ వద్ద అన్నగారికి చంద్రబాబు, ఎన్టీఆర్ తనయులు నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, మాగంటి బాబు, కంభంపాటి రామ్మోహనరావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి వంటి సీనియర్ నేతలుఎన్టీఆర్ ఘాట్ వద్ద అన్నగారికి నివాళులర్పించారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతున్న టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవ సభా ప్రాంగణం లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన స్వర్గీయ NTR ఉపయోగించిన చైతన్య రథం.#41stTDPFoundationDay pic.twitter.com/vBKyFeAEDk
— Telugu Desam Party (@JaiTDP) March 29, 2023
మరోవైపు ఆనాడు ఎన్నికల ప్రచారం కోసం అన్నగారు ఉపయోగించిన చైతన్య రథం ఇప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లోని సభా వేదిక వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చైతన్య రథంపైనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్నగారు సుడిగాలి పర్యటన చేసి ప్రజలకు చేరువయ్యారు. ఇప్పటికీ ఆ చైతన్య రథం చెక్కుచెదరకుండా ఉండేలాగా మరమ్మతులు చేయించి దానిని సభాస్థలి వద్దకు తీసుకువచ్చారు. ఈ ఆవిర్భావ సభలో అన్నగారి చైతన్య రథం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
నాటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ను ఉర్రూతలు ఊపిన ప్రజా చైతన్య యాత్ర రథం.. స్వర్గీయ ఎన్టీఆర్ ను రాష్ట్రం నలుమూలలకు తీసుకొని వెళ్ళిన వాహనం, తెలుగు నేలకు సరికొత్త ఊపిరులు ఊదిన ప్రజా రాజకీయ చైతన్య యాత్రకు సాక్ష్యం (1/2) pic.twitter.com/QjtIGDvNwa
— Telugu Desam Party (@JaiTDP) March 29, 2023