మాజీ ఎంపీ, సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు విచారణ సందర్భంగా నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. వివేకా కేసు విచారణ ఓ కొలిక్కి వచ్చిందని, ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయం అనుకుంటున్న తరుణంలో ఈ కేసు విచారణ అధికారి రాంసింగ్ సరిగా విచారణ చేయడం లేదంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో, రాంసింగ్ కు తోడుగా మరో అదనపు అధికారిని నియమించాలని సీబీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది.
ఇక, ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు దాదాపుగా ఖాయమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ కేసు మరో కీలక మలుపు తిరిగింది. తాజాగా ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఎంపీ అవినాష్ రెడ్డి ఆశ్రయించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కేసులో ఇప్పటికే అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు మూడు సార్లు విచారణకు పిలిచారు. త్వరలోనే మరోసారి అవినాష్ రెడ్డిని విచారణకు పిలుస్తారని, ఈసారి విచారణ తర్వాత ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మూడోదఫా విచారణ సందర్భంగానే తనను అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలు ఇవ్వాల్సిందిగా హైకోర్టును అవినాష్ రెడ్డి ఆశ్రయించారు. అయితే, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ తాము ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే తాజాగా అవినాష్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, అవినాష్ రెడ్డి-వివేక కేసు గురించి చర్చించేందుకే ఏపీ సీఎం జగన్ రేపు ఢిల్లీలో పర్యటించబోతున్నారని పుకార్లు వస్తున్నాయి.