టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న లోకేష్…సీఎం జగన్ పాలనపై విరుచుకుపడ్డారు. భూస్వాముల నుంచి భూములను విడిపించి పేదలకు పంచిన పరిటాల శ్రీరాములు పుట్టిన గడ్డ ఇది అని లోకేష్ అన్నారు. అరాచక శక్తులను అణచివేసి అనంతపురం ముద్దుబిడ్డ పరిటాల రవీంద్రను శాసనసభకు పంపిన ప్రాంతం ఈ పెనుగొండ అని లోకేష్ గుర్తు చేసుకున్నారు.
ఇటువంటి ఘన చరిత్ర ఉన్న పెనుగొండలో పాదయాత్ర చేయడం తన అదృష్టం అని లోకేష్ అన్నారు. యువగళాన్ని అడ్డుకోవద్దని జగన్ కు చెప్పినా వినలేదని, సాగనిస్తే పాదయాత్ర అడ్డుకుంటే దండయాత్ర అని గతంలోనే చెప్పానని లోకేష్ గుర్తు చేశారు. పోలీసులను పంపి తన మైకు, సౌండ్ వెహికల్ , స్టూల్ లాగేసుకున్నారని ఆరోపించారు. కానీ, ఇప్పుడు యువగళం దెబ్బకు తాడేపల్లి కూసాలు కదులుతున్నాయని లోకేష్ ఎద్దేవా చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన షాక్ కు జగన్ కు 14 డిగ్రీల జ్వరం పట్టుకుందన్నారు. త్వరలో వైసీపీ దుకాణం బంద్ కావడం ఖాయం అని జోస్యం చెప్పారు. ప్రస్తుతం వైసీపీలో రెండు వర్గాలున్నాయని, ఒకటి రాజారెడ్డి వర్గం అని, మరొకటి అంబేద్కర్ వర్గం అని అన్నారు. రాజారెడ్డి వర్గానికి జగన్ అధ్యక్షుడైతే, అంబేద్కర్ వర్గానికి ఉండవల్లి శ్రీదేవి అధ్యక్షురాలని చెప్పారు. వైసీపీలో అక్రమాలు, అన్యాయాలు, అవినీతి గురించి తెలిసి ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారని అన్నారు.
అంబేద్కర్ వర్గం బలం పెరిగి, రాజారెడ్డి వర్గం బలం తగ్గుతుందని అన్నారు. జగన్ ది చెత్త పాలనని వైసీపీ ఎమ్మెల్యేలు అంటున్నారని గుర్తు చేశారు. జగన్ టెన్త్ ఫెయిల్ అని, అందుకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయలేదని ఆరోపించారు. మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతానని జగన్ చెప్పారని, కానీ అది చేయలేదు కాబట్టి మహిళలు చీపురుతో కొడతారని భయపడి పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు.