గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న వరుస వ్యతిరేక పరిణామాలతో కేసీఆర్ కుటుంబంలో బాగా టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ మూడుసార్లు కవితను విచారించింది. మళ్ళీ విచారణకు ఎప్పుడు రమ్మంటుందో తెలీదు. విచారణకు వెళ్ళిన ప్రతిసారి అరెస్టు భయం వెంటాడుతోంది. ఇపుడు అరెస్టు చేస్తారు, కాసేపట్లో అరెస్టు ఖాయమంటు ఎలక్ట్రానిక్ మీడియా ఒకటే ఊదరగొడుతోంది. వరుసగా రెండురోజుల పాటు విచారణకు ఎదుర్కొన్న కవిత బుధవారమే ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు.
కవిత విషయాన్ని పక్కనపెట్టేస్తే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చాలా హాటుహాటుగా ఉన్నాయి. టీఎస్ పీఎస్పీ బోర్డు నిర్వహించిన ప్రవేశపరీక్షల ప్రశ్నపేపర్లు లీకేజీ వ్యవహారం చాలా తీవ్రంగా ఉంది. ఒకవైపు నిరుద్యోగులు, మరోవైపు పరీక్షలు రాసిన అభ్యర్ధులు ఇంకోవైపు రాజకీయపార్టీలు ప్రభుత్వాన్ని గట్టిగా కమ్ముకుంటున్నాయి. ఇవన్నీ సరిపోవన్నట్లుగా పేపర్ల లీకేజీ వ్యవహారంలో గవర్నర్ తమిళిసై కూడా బాగా ఆసక్తి చూపుతున్నారు. ప్రతిపక్షాలు తనను కలిసినపుడు చేసిన ఆరోపణల్లో వాస్తవాలను తెలుసుకుంటున్నారు.
టీఎస్ పీఎస్సీ బోర్డు రద్దు చేసే విషయంలో గవర్నర్ న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఒకవేళ గవర్నర్ గనుక బోర్డు రద్దుకు నిర్ణయం తీసుకుంటే ఏమి చేయాలన్నది కేసీయార్ ముందున్న తక్షణ సమస్య. క్వశ్చన్ పేపర్ల లీకేజీల్లో కొడుకు కేటీయార్ పాత్రపైనే ప్రతిపక్షాలు ఎక్కువగా దృష్టిపెట్టాయి. మంత్రివర్గం నుండి కేటీయార్ ను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. పేపర్ల లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వం నిర్ణయించిన సిట్ విచారణపై ఎవరికీ నమ్మకాలు లేవు.
సిట్ విచారణ ముందుకు ఈరోజు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరవబోతున్నారు. విచారణలో రేవంత్ ఏమి చెబుతారో చూడాలి. బండికి సిట్ నోటీసులు ఇచ్చిందని ప్రచారం జరిగినా అవంతా అబద్ధాలే అని తేలిపోయింది. అయితే ఈరోజే రేపే బండికి సిట్ నోటీసులు ఇవ్వటమైతే ఖాయంగానే కనిపిస్తోంది. ఈ విధంగా అటు ఢిల్లీలోను ఇటు రాష్ట్రంలోను రోజు రోజుకు మారిపోతున్న పరిణామాలతో కేసీయార్ కుటుంబంలో బాగా టెన్షన్ పెరిగిపోతోంది.