మొన్నటి వరకు ఎన్నికలు అంటే చాలు.. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్లే ఏపీ అధికార పార్టీకి ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఏ చిన్న తేడా వచ్చినా మొదటికే మోసం వచ్చే పరిస్థితి. దీనికి తోడు.. ఇటీవల ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మూడింటిలోనూ విపక్షం సంచలన విజయాన్ని నమోదు చేయటంతో జగన్ అండ్ కో ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి కావటమేకాదు.. అసలేం జరుగుతుంది? ఇంత జరుగుతున్నా మనకెందుకు సమాచారం అందలేదు? లాంటి సందేహాలు వ్యక్తమవుతున్న పరిస్థితి.
ఇలాంటి వేళలోనే తాజాగా జరుగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఏ రీతిలో ఉంటాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి కారణం లేకపోలేదు. మొత్తం ఏడు స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉండటమే దీనికికారణం. దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది.
అధికార.. ప్రతిపక్షపార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల ఈ రోజు (గురువారం) ఉదయం 8 గంటలకు మొదలై సాయంత్రం నాలుగు గంటలకు ముగుస్తుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగే ఈ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపుజరిపి.. తుది ఫలితాన్ని వెల్లడిస్తారు. వైసీపీ తరఫున ఏడుగురు అభ్యర్థుల్ని బరిలోకి దించటం తెలిసిందే.
ఇంతకూ వారెవరంటే..
– జయమంగళ వెంకట రమణ
– మర్రి రాజశేఖర్
– చంద్రగిరి ఏసురత్నం
– బొమ్మి ఇజ్రాయిల్
– కోలా గురువులు
– పోతుల సునీత
– పెనుమత్స సూర్యనారాయరాజు
వీరిని ఎంపిక చేసిన జగన్ కు షాకిచ్చేందుకు వీలుగా విపక్ష అధినేత చంద్రబాబు.. తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనురాధను తెర మీదకు తీసుకొచ్చారు. తాజాగా జరిగే ఎన్నికల్లో ఉన్న ఇబ్బంది ఏమంటే.. అధికారపార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు అధినాయకత్వం మీద గుర్రుగా ఉన్నారు.
వారు తమ అసంతృప్తిని ఓటు రూపంలో చూపినా.. ఏడో సీటు చేజారిపోవటం ఖాయం. ఇప్పటికే అధికార వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని బాహాటంగానే ప్రదర్శిస్తున్నారు. దీంతో.. తమకు ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ పరిస్థితిని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. ఒక్కో మండలి సభ్యుడిబాధ్యతను ఒక్కో మంత్రికి అప్పగించి.. వారికి 22 మంది ఎమ్మెల్యేలను అప్పగించి.. వారి చేత ఓటు వేయించాలన్న టాస్కును ఇచ్చారు. ఎవరైనా ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్న విషయాన్ని గుర్తించి.. వారిని బుజ్జగించటం కూడా సదరు మంత్రిదే బాధ్యత. ఎందుకంటే.. ఒక్క ఓటు తేడా వచ్చినా..తుది ఫలితంపై ప్రభావాన్ని చూపించటం ఖాయం.
దీంతో.. ఎన్నికల వేళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీలుగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా విజయవాడలోనే మకాం వేసేలా చర్యలు తీసుకున్నారు. దీంతో.. అందరూ విజయవాడలోనే ఉన్నారు. ఓటు వేసే విషయంలో ఇప్పటికే నాలుగుసార్లు మాక్ డ్రిల్ నిర్వహించటం ద్వారా.. చెల్లని ఓటు వేసే అవకాశం లేకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. ఎన్నికల మీద సభ్యులకు అవగాహన కల్పించారు కూడా.
ఇదిలా ఉండగా.. ఇటీవల జరిగిన పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడింటిని విపక్ష తెలుగుదేశం సంచలన విజయాన్ని సాధించటంతో సీఎం జగన్ మరింత అలెర్టుగా ఉన్నారని చెబుతున్నారు. ఒక్క ఓటు క్రాస్ అయినా.. చెల్లకుండా పోయినా తమకు వాటిల్లే నష్టం భారీగా ఉండటంతో అధికార పార్టీకి చెందిన వారంతా అప్రమత్తంగా ఉంటున్నారు.
అయితే.. వైసీపీలో ఉన్న లుకలుకలు.. అధినాయకత్వం మీద ఉన్న అసంతృప్తి తమకు లాభం చేకూరేలా మారుతుందన్న అభిప్రాయంలో టీడీపీ అధినేత ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము టార్గెట్ చేసిన ఒక్క స్థానాన్నిచేజిక్కించుకున్నా.. మొత్తం సీన్ మారిపోయే వీలు ఉండటంతో.. ఒకట్రెండు ఓట్లు తమకు అనుకూలంగా పడేలా టీడీపీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఏమైనా.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు ఉత్కంఠగా మారాయని చెప్పాలి. మరేం జరుగుతుందో తెలియాలంటే ఈ సాయంత్రం (గురువారం) వరకు వెయిట్ చేయక తప్పదు.