నూతన తెలుగు సంవత్సరాది శోభకృత్ నామ ఉగాదిని పురస్కరించుకుని.. ప్రభుత్వాలు నిర్వహించిన పంచాగ పఠనంలో ఎవరికి అనుకూలంగా వారికి పంచాంగ కర్తలు పంచాంగాన్ని వివరించడం గమనార్హం. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంచాంగ కర్త.. కొన్ని హెచ్చరికలు జారీ చేశారు.
వచ్చే మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని ఆయన జాగ్రత్తలు సూచించారు. అంతేకాదు.. రాజు(సీఎం)కు కష్టాలు తప్పవని కూడా హెచ్చరించారు. వీటిని చాలా ఓర్పుగా నేర్పుగా ఎదుర్కొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ప్రగతి భవన్లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో శారదాపీఠం పండితులు బ్రహ్మర్షి బాచంపల్లి సంతోష్‌కుమార్ పంచాంగ పఠనం చేశారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందన్నారు. పెండింగ్ బిల్లులన్నింటికి క్లియరెన్స్ ఈ ఏడాది రాబోతోందన్నారు.
కొంతమంది వ్యక్తుల నుంచి వ్యతిరేకతలు వస్తాయని.. పాలించే రాజు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో సమూల మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. విద్యా శాఖలో కొన్ని అవకతవకలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఈ ఏడాది రాష్ట్రంలో కొన్ని మత ఘర్షణలు, సామాజిక ఉద్రిక్తతలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ తెలంగాణ రాజకీయాల్లో(అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి) ఆసక్తికరమైన సంఘటనలు జరగబోతున్నాయని వెల్లడించారు.
ఈ మూడు మాసాల్లో విపరీతమైన ఒడిదుడుకులు జరగబోతున్నాయన్నారు. తెలంగాణ ప్రజలు ఆసక్తికరమైన రాజకీయాలను చూడబోతున్నారని తెలిపారు. మత ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందన్నారు. మొత్తంగా చూస్తే.. సీఎం కేసీఆర్ పరిస్థితి ఏం బాలేదని.. పరోక్షంగా ఆయన చెప్పేశారు.