తెలంగాణ ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్నారు రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్. ప్రభుత్వంలో షాడో సీఎంగా వ్యవహరిస్తున్నట్లుగా విమర్శలు ఉన్నప్పటికీ.. ఆయనకున్న సమర్థతకు ఆ మాత్రం చొరవ తీసుకుంటే తప్పేముంది? అన్న వాదన కూడా లేకపోలేదు.
ముఖ్యమంత్రి కొడుకుగా.. రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రిగా పేరున్న కేటీఆర్.. కొన్ని సందర్భాల్లో చొరవ తీసుకోవటం తప్పేం కాదన్న మాట వినిపిస్తోంది.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ విచారణకు హాజరయ్యే తన సోదరి కవితతో పాటు ఢిల్లీ వెళ్లిన కేటీఆర్.. మంగళవారం రాత్రి హైదరాబాద్ కు వచ్చారు. తన సోదరి.. బావతో పాటు పలువురు నేతలతో కలిసి కేటీఆర్ హైదరాబాద్ కు వచ్చారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు (బుధవారం)న ఆయన చేసిన ట్వీట్ ఒకటి ఆసక్తికరంగా మారింది. పండుగ వేళలో ఆయన పోస్టు చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
‘‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరుష పదాలతో ట్వీట్ చేసిన వారిని అరెస్టు చేస్తున్నారు. తెలంగాణ మాత్రం ఏకంగా ముఖ్యమంత్రిని.. మంత్రులను దుర్భాషలాడుతూ అవమానకరంగా మాట్లాడుతున్నారు. అయినా సహిస్తున్నాం. పరుష పదాలతో ట్వీట్ చేసినందుకు బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటకలో కన్నడ నటుడు చేతన్ ను అరెస్టు చేశారు. తెలంగాణలోనూ అదే తరహాలోనే సమాధానాన్ని ఇవ్వాలేమో?’ అంటూ పేర్కొన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులకు కేసులు.. అరెస్టులు చేస్తున్న వేళ.. తాము మాత్రం అలాంటివి ఎందుకు చేయకూడదన్నట్లుగా మంత్రి కేటీఆర్ మాట ఉంది. నిజమే.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తప్పు జరుగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తున్న కేటీఆర్.. అలాంటప్పుడు ఆ తప్పుల్ని చేయాల్సిన అవసరం ఏముంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వాక్ స్వాతంత్య్రం లేదన్న విషయాన్ని చెబుతున్న కేటీఆర్.. అలాంటి తీరునే తెలంగాణలోనూ తీసుకురావాలని ఎందుకు అనుకుంటున్నారు? తప్పుడు విధానాల్ని అనుసరించే కన్నా.. అలాంటి వాటికి భిన్నంగా తమ పాలన సాగుతుందని చెప్పటం బాగానే ఉంటుంది కానీ.. వారి తరహాలోనే సమాధానం ఇవ్వాలన్న ఆలోచన సరికాదని చెప్పాలే తప్పించి.. తెలంగాణలోనే అదే తరహాలో సమాధానం ఇవ్వాలన్న ఆలోచన కేటీఆర్ కు ఎందుకు వస్తున్నట్లు? అన్నది ప్రశ్నగా చెప్పొచ్చు.
తన ఆలోచనను ప్రజల నుంచి అభిప్రాయాల్ని అడిగారు మంత్రి కేటీఆర్. భావ ప్రకటనా స్వేచ్ఛ.. దూషించే స్వేచ్ఛ కాకూడదని ఆయన అగ్రహం వ్యక్తం చేయటం బాగానే ఉన్నా.. తాము అలాంటి తీరును ప్రదర్శించాలన్న ఆలోచన రేఖా మాత్రం కూడా రావటం సరికాదన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణ ప్రజలు మరింత స్వేచ్ఛను.. భావస్వేచ్ఛను కోరుకుంటారన్న విషయం తెలిసి మంత్రి కేటీఆర్ ఇలా వ్యాఖ్యానించటం దేనికి నిదర్శనం?