ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం వేళలో టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఎలాంటి సీన్ అయితే చోటు చేసుకుందో.. దాదాపు అలాంటి సీనే మంగళవారం సాయంత్రం తెలంగాణ బీజేపీ రథసారధి బండి సంజయ్ ఇంటి వద్దా చోటు చేసుకుంది.
రోజు తేడాతో రెండు జాతీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షుల ఇళ్లకు వెళ్లారు సిట్ అధికారులు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ ఉదంతంలో రేవంత్.. బండి సంజయ్ చేసిన ఘాటు ఆరోపణలపై కేసీఆర్ సర్కారు ఏర్పాటు చేసిన సిట్ టీం.. ఈ ఇద్దరు ముఖ్యనేతలకు నోటీసులు జారీ చేసింది.
పేపర్ లీక్ ఉదంతంలో చేసిన ఆరోపణలకు వివరణ కోరుతూ సిట్ ఈ ఇద్దరు నేతలకు నోటీసులు జారీ చేసింది. ఒకే ఊరిలో ఎక్కువ మందికి ర్యాంకులు వచ్చాయన్న ఆరోపణను ఈ ఇద్దరు నేతలు చేయటం తెలిసిందే. అదే సమయంలో మరిన్ని సంచలన ఆరోపణల్ని వారుచేశారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం రేవంత్ ఇంటికి వెళ్లిన అధికారులు.. తమముందుకు హాజరుకావాలంటూ నోటీసుల్ని ఇంటి బయట అతికించి వెళ్లారు.
ఇదిలా ఉంటే.. మంగళవారం సాయంత్రం ఇదే తరహా నోటీసులతో వెళ్లిన సిట్ అధికారులు.. ఆయన అందుబాటులో లేకపోవటంతో ఇంటి బయట అతికించి వెళ్లారు. పేపర్ లీకేజీ ఉదంతంలో వారు చేసిన ఆరోపణలకు తగిన ఆధారాల్ని తమకు ఇవ్వాలని సిట్ తమ నోటీసుల్లో పేర్కొంది. ఈ నెల 23న తగిన ఆధారాలతో తమ ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది.
అయితే.. ఈ ఉదంతంలో తాము చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాల్ని సిట్ కు ఎట్టిపరిస్థితుల్లో ఇవ్వమని బండి సంజయ్ తో పాటు.. రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. తమకు కేసీఆర్ సర్కారు ఏర్పాటు చేసిన సిట్ మీద నమ్మకం లేదని.. సిట్టింగ్ జడ్జిని నియమిస్తే.. తమ వద్ద ఉన్న ఆధారాల్ని ఇస్తామని పేర్కొనటం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిట్ ఎదుటకు బండి సంజయ్.. రేవంత్ హాజరవుతారా? తర్వాతేం జరగనుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.