టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. కదిరి నియోజకవర్గం నల్లచెరువు శివారులో లోకేష్ పాదయాత్ర 600 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చిన్న ఎల్లంపల్లి వద్ద టెంపుల్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో జగన్ పై లోకేష్ నిప్పులు చెరిగారు.
తాజాగా వెల్లడైన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు సైకోపాలనపై వ్యతిరేకతకు నిదర్శనమని లోకేష్ అన్నారు. అధికారమదంతో వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు ఏకంగా ప్రజలు వారికి గుండు కొట్టారని లోకేష్ ఎద్దేవా చేశారు. ఇది, ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా 2024లో చూపిస్తామని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు 2024 ఎన్నికలకు సెమీఫైనల్స్ అని వైసీపీ నేతలు చెప్పారని, కానీ ఫలితాలు వచ్చాక ఇవి కూడా ఒక ఎన్నికలేనా అని అంటున్నారని ఎద్దేవా చేశారు.
టెన్త్ ఫెయిల్ అయిన వాళ్లను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవికి వైసీపీ నిలబెట్టిందని, అందుకే 108 నియోజకవర్గాలలో యువత వైసీపీని ఛీ కొట్టిందని అన్నారు. కౌంటింగ్ లో అక్రమాలు జరిగాయని అధికార పార్టీ ఆరోపించిన దాఖలాలు చరిత్రలో లేవని, కానీ వైసీపీ అలాంటి ఆరోపణలు చేసిందని ఎద్దేవా చేశారు. వై నాట్ 175 అంటున్న జగన్ రెడ్డికి బాయ్ బాయ్ జగన్ అంటూ యువత తీర్పునిచ్చారని సెటైర్లు వేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తగిన గుణపాఠం చెప్పాయన్నారు.
ఎన్ని కుట్రలు చేసినా టిడిపి పట్టభద్రులు పట్టం కట్టారని అన్నారు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ ఒకటే నినాదం వినిపిస్తోందని అన్నారు. అనంతపురానికి జగన్ ఒక కంపెనీ తేలేదని, ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలేదని లోకేష్ అన్నారు. జగన్ ఒక ఫెయిల్డ్ సీఎం అని, పోలీసులకు వీక్లీ ఆఫ్ అన్న జగన్ ఇప్పుడు ఒకటో తేదీన జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.