ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వానికి ఎదురు గాలి వీస్తోందని ప్రతిపక్ష నేతలంతా ముక్తకంఠంతో చెబుతున్నా… వైసీపీ నేతలు మాత్రం బుకాయిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి షాక్ తగలడం తీవ్ర చర్చనీయాంశమైంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలకు గాను మూడింటిని టీడీపీ కైవసం చేసుకొని హ్యాట్రిక్ విక్టరీ సాధించింది. ఈ ఓటమిపై వైసీపీ నేతలు మిశ్రమంగా స్పందిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే కొందరు వైసీపీ నేతలు ఓటమిని అంగీకరిస్తుంటే…మరికొందరు మాత్రం ఇది అసలు విజయమే కాదన్నట్టుగా బుకాయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల ఫలితాలపై వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నామని, ఓటమిపై సమీక్ష చేస్తామని బాలినేని అన్నారు. ఇక, ప్రభుత్వంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు అసంతృప్తిగా ఉన్నట్టు ఈ ఎన్నికల ద్వారా స్పష్టమైందని బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే, ఓటర్లలో పట్టభద్రుల శాతం రెండు శాతం మాత్రమే అని, ఈ విషయాన్ని టీడీపీ గుర్తించాలని అన్నారు. 3 ఎమ్మెల్సీ సీట్లు గెలిస్తే సంబరపడిపోతున్నారని, 2024 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని బాలినేని జోస్యం చెప్పారు. ఇక, ఈ ఓటమిపై వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా స్పందించారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలవగానే గొప్పగా ఫీల్ అవుతున్నారని, తనకు తిరుగు లేదన్నట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
2024 ఎన్నికలే టీడీపీకి చివరి ఎన్నికలని, టీడీపీకి అవే ఆఖరి విజయోత్సవాలని విమర్శించారు. ఇక, వర్షాలు ఆగిన వెంటనే పంట నష్టాన్ని అంచనా వేస్తామని కాకాణి చెప్పారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకే జీవో నెంబర్ ఒకటి తీసుకొచ్చామని, అంగన్వాడి ఉద్యోగుల సమస్యల పట్ల తగిన విధంగా ప్రభుత్వం స్పందిస్తుందని అన్నారు.