ఆస్కార్ వేదికపై నాటు నాటు సత్తా చాటి అవార్డు దక్కించుకోవడంతో ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ పై ప్రశంసల జల్లు కురుస్తోన్న సంగతి తెలిసిందే. ఆ పాటలో స్టెప్పులేసి దుమ్మురేపిన చరణ్, తారక్ ల ను, ఆ పాటకు పనిచేసిన వారిపై పొలిటిషియన్లు మొదలు సెలబ్రిటీల వరకు పొగడ్తలలో ముంచెత్తుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చరణ్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు.
అమెరికా నుంచి వచ్చిన చెర్రీ…మెగాస్టార్ చిరంజీవితో కలిసి అమిత్ షాతో భేటీ అయ్యారు. లాస్ఏంజెలెస్ నుంచి వచ్చిన రామ్ చరణ్ ఢిల్లీలో అమిత్‌షాను కలిశారు. షాకు చిరంజీవి, రామ్‌చరణ్ ఇద్దరూ శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం రామ్ చరణ్‌కు అమిత్ షా శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా కాసేపు ముగ్గురు సినిమా గురించి ముచ్చటించుకున్నారు.
ఆ తర్వాత ‘నాటునాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై అమిత్ షా హర్షం వ్యక్తం చేస్తూ తెలుగులో ట్వీట్ చేశారు. ‘‘భారతీయ చిత్ర పరిశ్రమలో ఇద్దరు దిగ్గజాలను కలవడం ఆనందంగా ఉందని షా ఆ ట్వీట్లో పేర్కొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ దేశ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేసిందన్నారు. ఆర్ఆర్ఆర్ అద్భుత విజయం సాధించినందుకు, నాటునాటు పాటకు ఆస్కార్ వచ్చినందుకు రామ్‌చరణ్‌ను అభినందించాను’’ అని అమిత్ షా తెలుగులో చేసిన ట్వీట్ వైరల్ అయింది.
అమిత్ షాతో చిరు, చెర్రీల భేటీకి రాజకీయ ప్రాధాన్యత కూడా ఉందా అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా అల్లూరి సీతారామ రాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి చిరంజీవి హాజరై మోడీతో కరచాలనం చేయడం చర్చనీయాంవమైంది.