వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామని.. రాష్ట్రం అభివృద్ధి చెందుతోందంటే.. అది కేంద్రంలోని నరేం ద్ర మోడీ పాలన చలవల్లేనని కాబట్టి..ఏపీ ప్రజలు తమవైపే ఉన్నారని.. పదే పదే చెప్పే బీజేపీ నేతలు.. తాజాగా జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపై గంపెడాశలు పెట్టుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్‌కే మరోసారి అవకాశం ఇచ్చారు. అయితే.. ఆయన చిత్తుచిత్తుగా ఓడిపోయారు.
మాధవ్ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయారు. పోలైన వాటిలో చెల్లిన ఓట్లు తీసుకొని, అందులో ఆరో వంతు కంటే తక్కువ వచ్చిన వారిని డిపాజిట్ కోల్పోయినట్టుగా ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో 2,01,335 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీటిలో చెల్లిన ఓట్లు 1,89,017. ఆరో వంతు అంటే 31,502 ఓట్లు. అయితే బీజేపీ అభ్యర్థి పీవీఎన్ మాధవ్‌కు 10,884 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆయన డిపాజిట్ కోల్పోయారు.
మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏంటి? ఇలా అయితే.. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ పరిస్థితి ఏంటి? అనేది ఆసక్తికర చర్చగా మారింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం నుంచి ఈ ఎన్నికల్లో 37 మంది పోటీలో ఉన్నారు. వారిలో టీడీపీ, వైసీపీ, పీడీఎఫ్ అభ్యర్థులకు మాత్రమే ఆరో వంతు కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. మిగిలిన వారంతా డిపాజిట్ కోల్పోయారు. నామినేషన్ వేసిన అభ్యర్థి రూ.10 వేలు డిపాజిట్‌గా చెల్లిస్తారు. వారికి ఆరో వంతు ఓట్లు వస్తే…ఆ మొత్తం వెనక్కి ఇస్తారు.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానాన్ని బీజేపీ అతిగా అంచనా వేసుకుందనే వాదన ఉంది. ఇక్కడ నుంచి తామే గెలుస్తామని.. వైసీపీ, టీడీపీలో తమలో తాము కొట్టుకుని..త మకు అవకాశం ఇచ్చేస్తున్నాయని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. పైగా..సీనియర్లు ఎవరూ కూడా ఈ ఎన్నికల్లో ప్రచారం చేయలేదు. అంతేకాదు.. దీనిని సీనియర్లు సీరియస్‌గా తీసుకోలేదు. ఈ పరిణామాలతోనే బీజేపీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిందని అంటున్నారు. ప్రస్తుతం ఈ ఓటమి కారణాలపై కమల నాథులు లెక్కలు వేసుకుంటున్నారు.