జగన్ చిన్నాన్న, వైఎస్ సోదరుడు వివేకా హత్యకు గురై నేటికి నాలుగేళ్లు పూర్తయిన సంగతి తెలిసిందే. జగన్ సీఎంగా ఉన్నప్పటికీ ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉండడం, చివరకు పొరుగు రాష్ట్రం తెలంగాణకు బదిలీ కావడం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. వివేకాకు, ఆయన కుటుంబ సభ్యులకు ఇప్పటికైనా న్యాయం చేయాలని జగన్ ను ఆయన డిమాండ్ చేశారు.
జస్టిస్ ఫర్ వివేకా అంటూ చంద్రబాబు హ్యాష్ ట్యాగ్ ను ట్వీట్ చేశారు. వివేకా హత్య జగనాసుర రక్త చరిత్రేనని, పులివెందుల పూల అంగళ్ల నుంచి ఏపీలోని మారు మూల పల్లె వరకు ప్రతీ ఒక్కరికీ ఆ విషయం తెలుసని చంద్రబాబు అన్నారు. నాలుగేళ్లలో జగన్ ఒక్క పనీ చేయలేకపోయాడని, ఆఖరుకు సొంత బాబాయిని హత్యచేసిన హంతకులను చట్టపరంగా శిక్షించడంలోనూ విఫలమయ్యాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
వివేకా హత్యకు కుట్ర జరిగింది అవినాష్ రెడ్డి ఇంట్లోనేనని, అది జగనాసుర రక్త చరిత్రేనని చంద్రబాబు విమర్శించారు. తండ్రి శవం పక్కన ఉండగానే సీఎం పదవి కోసం సంతకాలు సేకరించిన వ్యక్తి, బాబాయి హత్యతో రాజకీయ లబ్ది పొందిన వ్యక్తి ఇప్పుడు ఆడబిడ్డ సునీతకు న్యాయం చేస్తాడా అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు. నారాసర రక్త చరిత్ర అని ఆ రోజు సాక్షి పేపర్లో వేసుకున్నారని, కానీ, ఈరోజు అసలు నిజం బట్టబయలైందని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
గూగుల్ టేక్ అవుట్ వంటి టెక్నాలజీ ఒకటి వస్తుందని, దానికి తగులుకుంటానని జగన్ ఊహించి ఉండడంటూ సెటైర్లు వేశారు. గూగుల్ అంకుల్ ని అడిగితే చాలు ఏం జరిగిందో అన్న వివరాలన్నింటినీ మన ముందు ఉంచుతుంది అంటూ జగన్ కు చురకలంటించారు. ఎంపీ సీటు కోసమే వివేకా అడ్డు తొలగించుకున్నారని, కోడి కత్తి కమలహాసన్ థ్రిల్లర్ సినిమాకు తీసిపోని రీతిలో స్టోరీ రాశారని జగన్ ను ఎద్దేవా చేశారు.