వైసీపీ పాలనలో టీడీపీ నేతలు, మద్దతుదారులు, కార్యకర్తలు, అభిమానులను టార్గెట్ చేయడం పరిపాటిగా మారిన సంగతి తెలిసిందే. అంతా మా ఇష్టం…మాకు నచ్చినట్లు జరగాలి అన్న రీతిలో వైసీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వైనంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక, టీడీపీకి అనుకూలంగా ఏ కార్యక్రమం చేసినా జగన్ అండ్ కో అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని పలువురు దుయ్యబడుతున్నారు.
ఆఖరికి సినిమా పాటలకు కూడా వైసీపీ నేతలు రాజకీయ రంగు పులుముతున్న వైనం సర్వత్రా చర్చనీయాంశమైంది. నరసరావుపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో బాలయ్య సినిమాలోని పాట వేశారనే కారణంతో స్థానిక వైసీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డిని గోపిరెడ్డి ఇబ్బంది పెట్టారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే గోపిరెడ్డి ఇంటిముందు భాస్కర్ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో, ఈ ఘటనపై హీరో, హిందుపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు.
ఎమ్మెల్యే గోపిరెడ్డి పేరు చెప్పకుండానే ఆయనపై బాలయ్య ఫైర్ అయ్యారు. సినిమాను సినిమాగానే చూడాలని, ఇంకోసారి ఇలాంటి ఘటన జరిగితే ఊరుకోబోనని గోపిరెడ్డికి పరోక్షంగా బాలయ్య వార్నింగ్ ఇచ్చారు. బాలకృష్ణ పాట వేశారంటూ వైసీపీ కార్యకర్తనే ఇబ్బంది పెట్టారని, అంతకంటే మూర్ఖుడు ఇంకెవరైనా ఉంటారా అని దుయ్యబట్టారు. యథా రాజ తథా ప్రజా అంటూ జగన్ పై కూడా పరోక్షంగా బాలయ్య విమర్శలు గుప్పించారు.
స్థాయి దిగజార్చుకున్న ఆ వ్యక్తి పేరు తాను చెప్పబోనని, ఇంకోసారి ఇలాంటిది జరిగితే మాత్రం ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు. తాను చిటికేస్తే…మూడో కన్ను తెరిస్తే….చూస్కోండి జాగ్రత్త అంటూ వైసీపీ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు బాలయ్య బాబు. రాజకీయ నాయకుడిగా తనపైకి వస్తానంటే రెడీ అని, సినిమాల జోలికి రావొద్దని హెచ్చరించారు. మీ పరిధిలో మీరు ఉండండి అని వైసీపీ నేతలకు బాలకృష్ణ హితవు పలికారు.