ఏపీ సీఎం జగన్.. తన ఆస్తులకు చెందిన కేసుల విషయంలోనే కోర్టుకు హాజరుకావడం లేదన్న విషయం తెలిసిందే. గతంలో విపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యే వారు. కానీ, ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక ప్రొవిజన్ తెచ్చుకుని.. కోర్టుకు వెళ్లడం మానేశారు. అయితే.. ఇప్పుడు ఆయన మరోసారి కోర్టు మెట్లు ఎక్కక తప్పని పరిస్థితి ఏర్పడింది.
అయితే.. ఈ సారి మాత్రం సీఎం జగన్ నిందితుడిగా మాత్రం కాదు.. సాక్షిగాను, బాధితుడిగాను కోర్టుకు హాజరు కావాల్సి ఉండడం గమనార్హం. మరి ఆ కేసు..ఏంటంటే.. విశాఖ విమానాశ్రయంలో జరిగిన కోడికత్తి కేసు. కోడికత్తి కేసులో సీఎం జగన్ ఏప్రిల్ 10న విచారణకు హాజరు కావాలని విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది. విశాఖ విమానాశ్రయంలో నాటి ప్రతిపక్ష నేత జగన్‌పై కోడికత్తితో జరిగిన దాడి కేసులో బాధితులతో పాటు సాక్షి కూడా కోర్టుకు హాజరు కావాల్సిందేనని న్యాయస్థానం తేల్చి చెప్పింది.
ఈ కేసులో మొదటి సాక్షిగా ఉన్న సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ దినేశ్‌కుమార్‌ను విచారిస్తున్న సమయంలో న్యాయమూర్తి వి.శ్రీనివాస ఆంజనేయమూర్తి ఈ ఉత్తర్వులు ఇచ్చారు. దినేశ్‌కుమార్ వాంగ్మూలం నమోదు చేసుకున్న తర్వాత, బాధితుడు, రెండో సాక్షిగా ఉన్న సీఎం జగన్‌ను, మూడో సాక్షిగా ఉన్న ఆయన పీఏ నాగేశ్వర్ రెడ్డిని విచారించాల్సి ఉందని, వారికి కోర్టుకు పిలిపించాలని న్యాయవాది సలీం అభ్యర్థించారు.
అంగీకరించిన న్యాయమూర్తి.. సీఎం జగన్, ఆయన పీఏ నాగేశ్వర్ రెడ్డి ఏప్రిల్ 10న కోర్టుకు హాజరు కావాలని ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో వచ్చే నెల 10న ఎన్ని పనులున్నా.. ఎంత బిజీగా ఉన్నా.. సీఎం జగన్ కోర్టుకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది.