విక్టరీ వెంకటేష్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ నెట్‌ఫ్లిక్స్‌లోకి రానే వచ్చింది. ఐతే ఈ షో రిలీజ్‌కు రెడీ అవుతున్న టైంలో.. దీన్ని కుటుంబ సమేతంగా చూడొద్దని వెంకీ హెచ్చరిస్తే ఏమో అనుకున్నారు. కానీ ఈ సిరీస్ మొదలైన పది నిమిషాలకే వెంకీ ఆ మాట ఎందుకు అన్నాడో ఆయన అభిమానులకు అర్థం అయిపోయింది. వెంకీని విపరీతంగా అభిమానించే ఫ్యామిలీ ఆడియన్స్ సంగతి పక్కన పెట్టేయండి. ఆయన్ని ఇష్టపడే యూత్ అయినా సరే.. ఈ సిరీస్ చూసి తట్టుకోవడం కష్టమే.
అంత అసభ్యకరంగా ఉన్నాయి ఇందులో డైలాగులు, సన్నివేశాలు. కొంచెం సుగర్ కోటింగ్ వేసి చెప్పాలన్నా కూడా చాలా జుగుప్సాకరంగా అనిపించే డైలాగులు.. సన్నివేశాలతో ఈ సిరీస్‌ను నింపేశారు. వెబ్ సిరీస్‌లకు సెన్సార్ ఉండదు. ఇక్కడ మాటలు, సన్నివేశాలను సహజంగా చూపించడానికి స్కోప్ ఉంటుంది.. దాని వల్ల ఒరిజినల్ ఎమోషన్స్ బయటికి వస్తాయి అన్నది నిజమే. కానీ అవసరం మేరకు బూతులు.. ఇంటిమేట్ సీన్లు పెట్టడం వరకు ఓకే. కానీ ‘రానా నాయుడు’ చూస్తుంటే ఆ ఫీలింగ్ కలగదు. అవసరం లేకపోయినా.. బలవంతంగా పాత్రలతో పచ్చి బూతులు మాట్లాడించినట్లు.. వల్గర్ సీన్లు చేయించినట్లు అనిపిస్తుంది.
ముఖ్యంగా వెంకీ చేసిన రానా నాయుడు పాత్ర గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఏ రకంగా చూసినా వెంకీ చేయాల్సిన పాత్ర కాదిది. పనిగట్టుకుని ఆయన ఇమేజ్ను దెబ్బ తీయడానికి.. అభిమానుల్ని హర్ట్ చేయడానికి ఈ పాత్రను ఆయనకు ఇచ్చారేమో అనిపిస్తుంది. చేసిందేమో 60 ఏళ్లు పైబడ్డ వ్యక్తి పాత్ర. పలికే డైలాగుల్లో ఏమో పచ్చి బూతులు. ఇలా మజిల్స్ పెంచితేనే కదా.. మసాజ్ బాగా చేయగలం అంటూ ఆయన ఇచ్చిన ఒక ఎక్స్ప్రెషన్ చూస్తే.. ఇది ఎలా చేయగలిగారు అనిపిస్తుంది.
‘‘బుల్లి తమ్ముడు’’ అంటూ చెప్పిన మరో డైలాగ్.. ‘‘ఆ ఐస్ దగ్గరికి తీసుకురాకు.. నాలో ఉన్న వేడికి కరిగిపోతుంది’’ లాంటి మరో డైలాగ్.. ఇలా వెంకీ చాలా ఇబ్బంది పడుతూ.. చూసే వారిని ఇబ్బంది పెట్టిన సంభాషణలు, సన్నివేశాలకు కొదవే లేదు. సిరీస్ అంతా కూడా ఆయన పాత్ర చాలా సిల్లీగా.. అభిమానులు జీర్ణించుకోలేని విధంగానే సాగుతుంది. ఏ ‘ఫ్యామిలీ మ్యాన్’ లాంటి సిరీస్‌లో చేసుకోక ఇలాంటి షోతో డిజిటల్ ఎంట్రీ ఇవ్వాలని వెంకీ ఎలా ఫిక్సయ్యారో?