వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్ అస్తవ్యస్త పాలనను టీడీపీ నేతలు ఎండగడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీడీపీ నేతల విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ నేతలు…ఆ విమర్శలకు జవాబివ్వలేక వ్యక్తిగత దూషణలకు, వ్యక్తిత్వహననానికి దిగుతున్న వైనం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ మహిళా నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితను వైసీపీ నేతలు టార్గెట్ చేశారు.
అనితపై వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు, వైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జి భార్గవ్ రెడ్డి చేసిన ఓ మార్ఫింగ్ వీడియో వైరల్ అయింది. చంద్రబాబును గద్దె దింపాలని, జగన్ ను సీఎం చేయాలని అనిత అన్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వీడియోపై అనిత స్పందించారు. ఆ వ్యాఖ్యలు తనవి కావని, మార్ఫింగ్, ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని ఆమె మండిపడ్డారు.
అంతేకాదు, భార్గవ్ రెడ్డిపై విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులకు అనిత ఫిర్యాదు చేశారు. తన వ్యాఖ్యలను భార్గవ్ రెడ్డి మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు, మహిళా దినోత్సవంనాడు ఆ మార్ఫింగ్ వీడియోను సాక్షి ఛానల్ లో కూడా ప్రసారం చేశారని ఫైర్ అయ్యారు. విపక్ష నేతలను ఇబ్బంది పెడుతున్న వైసీపీ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు.
ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై కేసులు పెడుతున్నారని అనిత ఆరోపించారు. టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణులు ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్ చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జగన్ కు పరదాలు కప్పడానికేనా పోలీసులున్నది? అని ఆమె ప్రశ్నించారు.