తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసిన వారిని ఎలాగైనా జైలుకు పంపాలన్న లక్ష్యంతో ఆయన కుమార్తె సునీత న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ కేసులో సీబీఐ వైఎస్ అవినాశ్ రెడ్డిని ప్రస్తుతం విచారిస్తోంది.
సీబీఐ 160 సెక్షన్ ప్రకారం నోటీసులు ఇవ్వడంతో తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే, అవినాశ్ వేసిన పిటిషన్‌ను విచారించేటప్పుడు తన వాదనలు కూడా వినాలని.. అందుకోసం ఈ కేసులో తనను ఇంప్లీడ్ చేయాలని కోరుతూ సునీత కూడా పిటిషన్ వేశారు. ఇప్పటివరకు కోర్టులో విజయం సాధిస్తూ వస్తున్న ఈసారీ అనుకూల ఆదేశాలు సాధించగలరని.. ఆమె న్యాయపరంగా పోరాటం చేస్తున్నారని ఆమె వర్గీయులు చెప్తున్నారు.
అవినాశ్ రెడ్డ తెలంగాణ హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్లో అనేక అంశాలను ప్రస్తావించారు. వైఎస్ వివేకా హత్య జరిగినప్పుడు లభ్యమయిన లేఖ మీద సీబీఐ అధికారులు ఎలాంటి విచారణ చేయడం లేదని, ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి చెప్పిన దాని ప్రకారమే సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారని అవినాశ్ రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు.
అంతేకాదు… తన న్యాయవాదుల సమక్షంలో విచారణ జరపాలని కోరినా సీబీఐ అధికారులు వినిపించుకోవడం లేదని, అలాగే వీడియో రికార్డింగ్ కూడా చేయడం లేదని ఆయన తన పిటిషన్లో ఆరోపించారు.
కాగా సునీత కూడా తన వాదనలను ఈ పిటీషన్‌పై వినిపించడానికి పిటీషన్ వేయడంతో న్యాయస్థానం అంగీకరించే అవకాశమే ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఈ కేసులో న్యాయపోరాటం చేస్తున్న సునీత… న్యాయస్థానాన్ని ఆశ్రయించి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించేలా తీర్పు వచ్చేలా చేయగలిగారు.
ఆ తర్వాత ఏపీలో కాకుండా ఇతర రాష్ట్రాల న్యాయస్థానానికి ఈ కేసు విచారణను బదిలీ చేయాలని సుప్రీంకోర్టును కోరి అందుకు అనుమతి సాధించారు. ఇప్పుడు అవినాశ్ రెడ్డి పిటిషన్లో తనను ఇంప్లీడ్ చేయాలని కోరడంతో ఏంజరుగుతుందా అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.