వధువుకు కట్నం ఇవ్వడం ఏంటి అన్న చర్చ ఇటీవలి కాలంలో ఎక్కువైంది. కొద్ది నెలలుగా చైనా గురించి.. అనేక వార్తలు వస్తున్నాయి. అక్కడ పెళ్లి కూతురుకు పెళ్లి కొడుకు బంధువులు కట్నం ఇస్తున్నారు. ప్రభుత్వం ఇటీవలే కట్నాలు తీసుకోవద్దని.. వధువులకు విన్నవించింది. ఇదిలావుంటే.. ఇప్పుడు మన దేశంలోనూ వధువులకు కొరత ఏర్పడి.. పెళ్లి కాని ప్రసాదులు పెరుగుతున్నారు. ఈ క్రమంలోవధువు దొరికితే చాలు అని అనుకునే పరిస్థితి వచ్చింది.
దీంతో గత రెండేళ్లుగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరులకు కట్నాలు ఇచ్చే సంస్కృతి తగ్గిపోయింది. “మాకు ఎలాంటి కట్నం వద్దు పెళ్లి గ్రాండ్‌గా చేయండి చాలు“ అంటున్న వారు పెరుగుతున్నారు. దీంతో ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులు హాయిగా పెళ్లిళ్లు చేసి పంపేస్తున్నారు. స్థోమత ఉన్నవారు మాత్రమే కట్నాలు ఇస్తున్నారు. అయితే.. ఇదే హైదరాబాద్‌లో ఇప్పుడు సంచలన కేసు ఒకటి వెలుగు చూసింది. పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు, పెళ్లికూతురు సహా.. కట్నం కోసం డిమాండ్ చేశారు.
అంతేకాదు.. అడిగినంత కట్నం ఇవ్వలేదని.. పీటలపై పెళ్లిని రద్దు చేసుకున్నారు కూడా! వాస్తవానికి ఇలాంటివి.. పెళ్లి కొడుకుల సైడ్ నుంచి మాత్రమే మనం వింటున్నాం. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. దీంతో పెళ్లి కొడుకు బంధువులు ఏమీ చేయలేక.. మౌనంగా ఉన్నారు.
ఇంతకీ ఏం జరిగింది?
మేడ్చల్-మల్కాజిగిరి ప్రాంతంలోని ఘట్కేసర్లో పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన యువకుడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన యువతితో పెద్దలు వివాహం నిశ్చయించారు. అబ్బాయి తరఫు వారు అమ్మాయికి రూ.2 లక్షలు కట్నం ఇచ్చేలా కులపెద్దల సమక్షంలో అంగీకారం కుదిరింది.
గురువారం రాత్రి 7:21 గంటలకు పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. అబ్బాయి కుటుంబ సభ్యులు ఘట్కేసర్లోని ఓ ఫంక్షన్హాల్లో పెళ్లి జరుగుతుందని ఆహ్వాన పత్రికలు బంధుమిత్రులకు పంపిణీ చేశారు. ముహూర్తానికి ముందే అబ్బాయి, కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు కల్యాణ మండపానికి చేరుకున్నారు. ముహూర్తానికి సమయం అవుతున్నా.. అమ్మాయి, వారి కుటుంబసభ్యులు రాకపోవడంతో వరుడి తరఫు వారు ఆరాతీశారు.
అబ్బాయి తరఫున ఇచ్చే కట్నం సరిపోవడం లేదని, అదనంగా కావాలని వధువు డిమాండ్ చేసింది. వివాహ సమయానికి గంట ముందు అదనంగా మరో రెండు లక్షలు కావాలని వధువు తేల్చి చెప్పింది. దీంతో వరుడి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో వారు అమ్మాయి కుటుంబసభ్యులను పోలీస్‌స్టేషన్‌కు రప్పించారు.
లగ్గాల నాడు ఇచ్చిన రూ.2 లక్షలకు అదనంగా మరో 2 లక్షలు ఇస్తేనే పెళ్లి జరుగుతుందని అమ్మాయి స్వయంగా చెప్పడంతో పెళ్లి కుమారుడి కుటుంబ సభ్యులు ఖంగుతిన్నారు. దీనిపై మరో రెండు రోజుల గడువు ఇవ్వాలని.. కోరడంతో పోలీసుల సమక్షంలో అంగీకారం కుదిరింది. మరి ఏం జరుగుతుందో చూడాలి. అయితే.. పెళ్లికి చేసిన రూ.5 లక్షల ఖర్చు వృథా అయిందని.. పెళ్లి కుమారుడి బంధువులు లబోదిబోమన్నారు.