సీఎం జగన్ పాలనలో రాష్ట్ర ఆర్థిక స్థితి నానాటికీ దిగజారుతోందని, అప్పుల ఊబిలో కూరుకుపోయి రాష్ట్రం అధోగతి పాలవుతోందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రజలంతా చంద్రబాబు పాలన మళ్లీ కోరుకుంటున్నారని టిడిపి నేతలు చెబుతున్నారు. లోకేష్ పాదయాత్రలో కూడా సైకో పోవాలి సైకిల్ పాలన రావాలి అంటూ ప్రజలు కోరుతున్న వైనం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర దుస్థితిపై సినీ హీరో నారా రోహిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ మళ్లీ గాడిలో పడాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని నారా రోహిత్ ఆకాంక్షించారు. రాష్ట్రం అన్ని విధాలుగా నాశనం అయిందని, మళ్లీ బాబు గారు సీఎం అయితేనే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. సత్తెనపల్లిలో దివంగత నేత అన్న నందమూరి తారక రామారావు, దివంగత నేత కోడెల శివప్రసాద్ విగ్రహాలను నారా రోహిత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.
ఈ విగ్రహావిష్కరణ సందర్భంగా సత్తెనపల్లిలో నారా రోహిత్ తో కలిసి కోడెల తనయుడు కోడెల శివరాం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేసిన రోహిత్..చంద్రబాబు మళ్ళీ సీఎం అయితేనే రాష్ట్రానికి పునర్వైభవం వస్తుందని అన్నారు. 2019లో తాను సత్తెనపల్లికి వచ్చానని, కోడెల శివప్రసాద్ తో కలిసి ఎన్నికల ప్రచారం చేశానని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు కోడెల మన మధ్య లేకపోవడం బాధాకరమని అన్నారు. ఎన్టీఆర్, కోడెల లకు చావు లేదని చెప్పారు. ఆ ఇద్దరు నేతలు టీడీపీ జెండాలో, కార్యకర్తల గుండెల్లో నిలిచే ఉంటారని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలందరి ఆశీర్వాదం శివరాంతో ఉండాలని, ఆయన ఘన విజయం సాధిస్తారని రోహిత్ ఆశాభావం వ్యక్తం చేశారు.