సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా, ఈ కేసు విచారణలో సిబిఐ స్పీడ్ పెంచడంతో వైసిపి అధినేత జగన్ తో పాటు వైసిపి ఎంపీ అవినాష్ రెడ్డికి చిక్కులు తప్పడం లేదు. ఈ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని ఇప్పటికే సిబిఐ అధికారులు రెండు సార్లు విచారణ జరిపారు. ఈ క్రమంలోనే తాజాగా అవినాష్ రెడ్డికి మరోసారి సిబిఐ షాక్ ఇచ్చింది.
రేపు మూడోసారి విచారణకు హాజరుకావాలని తాజాగా అవినాష్ కు మరోసారి సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. హైదరాబాదులోని సీబీఐ కార్యాలయంలో మార్చి ఆరో తేదీన విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులలో సిబిఐ అధికారులు పేర్కొన్నారు. పులివెందులలోని అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ నోటీసులు అందించినట్టు తెలుస్తోంది. ఇక, అంతకుముందే అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 12న విచారణకు రావాలని భాస్కర్ రెడ్డికి ఇచ్చిన నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు.
మరోవైపు ఈ కేసులో నిందితుడు ఉమాశంకర్ రెడ్డి భార్య స్వాతిని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించిన విషయం సంచలనం రేపుతోంది. ఈ ప్రకారం జిల్లా ఎస్పీకి స్వాతి ఫోన్ చేసి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. తన ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు దురుసుగా మాట్లాడారని, వివేకాను నీ భర్తే చంపాడు కదా అంటూ గదమాయించారని ఆమె వాపోయింది. దీంతో, ఆ ఘటనపై విచారణ జరపాలని ఎస్పీ… స్థానిక సీఐని ఆదేశించారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరిపినట్టుగా తెలుస్తోంది.