గంటా శ్రీనివాసరావు చాలాకాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. గంటా వైసీపీలో చేరబోతున్నారని కూడా జోరుగా ప్రచారం జరిగింది. కానీ, గంటా పార్టీ మారలేదు….మారకపోగా ఆయన సొంతగూటివైపే మళ్లుతున్నారని సంకేతాలు కూడా వచ్చాయి. హఠాత్తుగా నారా లోకేష్ ను గంటా కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ తర్వాత గంటానుద్దేశించి టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు దాక్కున్నవారంతా ఎన్నికల ముందు బయటికి వస్తున్నారని అయ్యన్న విమర్శించారు. పార్టీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. వారే అసలు సిసలు టీడీపీ కార్యకర్తలు అని, పార్టీ కష్టాల్లో ఉంటే ఇంట్లో పడుకునేవాడు నిజమైన కార్యకర్త కాదని చెప్పారు. దీంతో, గంటా రాకను కొందరు టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారని, మరి గంటా టీడీపీలో ఉంటారా లేక ఏం చేస్తారు అన్నదానిపై ఉత్కంఠ ఏర్పడింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా వైసీపీ ప్రభుత్వంపై గంటా విరుచుకుపడ్డారు. విశాఖలో జరగబోతోన్న ప్రపంచ పెట్టుబడుల సమావేశానికి ముందు ప్రభుత్వానికి గంటా సంధించిన ప్రశ్నలు ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. జగన్ సర్కార్ ను ఇరుకునపెట్టేలా, ఈ నాలుగేళ్లలో ఏపీలో జగన్ దయ వల్ల పారిశ్రామిక రంగం ఎంత దెబ్బతిందో తెలియచెప్పేలా గంటా సంధించిన 20 ప్రశ్నలు ఇపుడు చర్చనీయాంశమయ్యాయి.
ఇక, ఈ ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో చేసినవి కావని, సగటు పౌరుడి సందేహాలని, వాటిపై సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నానని గంటా చెప్పడం కొసమెరుపు.
గంటా సంధించిన 20 ప్రశ్నలు ఇవే….
1. పెట్టుబడుల స్వర్గధామం ఆయిన దావోస్ లో ఇటీవల జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం కు వెళ్లక పోవడానికి సరైన కారణాలు ఏంటి?
దానివల్ల రాష్ట్ర ప్రతిష్ట ఎంత దెబ్బతిందో కనీసం ఇప్పటికైనా గుర్తించారా?
2. ఒక రాజధానినే నిర్మించుకోలేని లేని రాష్ట్రంలో పెట్టుబడిదారులకు ఎలాంటి నమ్మకాన్ని కలిగించగలం?
3. జాకీ (Jockey) అనే అండర్వేర్ కంపెనీ రాష్ట్రంలో ఉండలేమని పారిపోతుంటే ఏమి చేశారు? కారణాలని విశ్లేషించి ఆ తప్పులను సరిదిద్దుకుని పునరావృతం కావన్న భరోసా ఇచ్చారా?
4. కియా కంపెనీకి అనుబంధ కంపెనీలు ఒక్కటీ తీసుకురాలేక పోయినందుకు ఆత్మ సమీక్ష చేసుకున్నారా?
5. హెచ్ఎస్బీసీ (HSBC) ఇక్కడ నుంచి వెళ్లకుండా ఆపే ప్రయత్నం కనీసం చేశారా?
6. లులూని ఇక్కడ నుంచి తరిమేశామని ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో చెబుతారా?
7. అమర్‌రాజా బ్యాటరీస్ ను విజయవంతంగా రాష్ట్రం నుంచి వెళ్లగొట్టామని సమ్మిట్‌లో గొంతెత్తి చెబుతారా?
8. భోగాపురం ఎయిర్ పోర్ట్‌ను నాలుగేళ్లు శంకుస్థాపన చేయకుండా వదిలేసి ఇప్పుడు ఎందుకు హడావుడి చేస్తున్నారు?
9. ఈ సమ్మిట్ కే 25 ఛార్టర్డ్ ఫ్లైట్స్ వస్తుంటే ప్రస్తుత ఎయిర్ పోర్టులో18 కి మాత్రమే పార్కింగ్ చేసే సౌకర్యం ఉందని ఎలా చెబుతున్నారు? అదే భోగాపురం ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించుకుని ఉంటే ఈ సమస్య ఉండేదా?
10. నాలుగేళ్లలో రాష్ట్రంలో అప్పటికే ఉన్న పోర్ట్‌లు తప్ప కొత్తగా ఒక్క పోర్ట్‌ను అయినా అభివృద్ధి చేశారా?
11. అసలు మీరు పారిశ్రామిక వేత్తలలో ఎలాంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయకుండా పెట్టుబడుల సదస్సు పెట్టేంత సాహసం చేయడం వెనుక మీ కాన్ఫిడెన్స్‌ను ఎలా అర్ధం చేసుకోవాలి?
12. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని చెప్పి పెట్టుబడులను ఆహ్వానించగలమా?
13. 2019 లో విశాఖలో దాదాపు యాభైవేల మంది ఐటీ ఎంప్లాయీస్ ఉంటే ఇప్పుడు 2, 3 వేలకు ఎందుకు తగ్గిపోయారు?
14. మీ ప్రభుత్వం వచ్చాక ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఒక్క కంపెనీకి ఒక్క రూపాయి అయినా ఇచ్చారా?
15. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి ఫిన్ కార్ప్ కంపెనీలు ఎందుకు ఇక్కడ నుంచి పారిపోయాయి?
16. అదానీ డేటా సెంటర్‌కు గతంలోనే శంకుస్థాపన జరిగింది.. కానీ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. అయినా మళ్లీ అదనంగా భూమి కేటాయించడం వెనుక రహస్యం ఏంటి?
17. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ప్రతీ నెలా మొదటి తేదీ నుంచి చివరి తేదీ దాకా ఎందుకు తీసుకుంటున్నారు?
18. తన ఉద్యోగులకు సకాలంలో జీతాలే ఇవ్వలేని ప్రభుత్వాలను నమ్మి పెట్టుబడులు ఎలా వస్తాయో చెప్పగలరా?
19. సరైన ఉపాధి అవకాశాలు లేక రాష్ట్రంలో సగటు పౌరుడి కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయిందన్న వాస్తవాన్ని అంగీకరిస్తారా?
20. చిట్టచివరిగా మీ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తయ్యాక, ఎన్నికలకు ఏడాది ముందు పెట్టుబడుల సదస్సు పేరుతో ఈ హడావుడి వెనుక కారణాలేంటి?