టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్..దర్శక ధీరుడు రాజమౌళిల కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుల బరిలో నిలవడంతో తెలుగువారంతా గర్వంతో కాలర్ ఎగరేస్తున్నారు. ఇక, ఈ సినిమాలో తారక్, చెర్రీల పెర్ఫార్మెన్స్ కు, రాజమౌళి దర్శకత్వానికి హాలీవుడ్ దర్శకులతో పాటు క్రిటిక్స్ కూడా ఫిదా అయ్యారు.
ఈ క్రమంలోనే ఆల్రెడీ గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న ఈ సినిమా తాజాగా క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులనూ కొల్లగొట్టింది. బెస్ట్ స్టంట్స్, బెస్ట్ యాక్షన్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు), బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, హెచ్సీఏ స్పాట్ లైట్ (విదేశాల్లో సైతం విశేష ప్రేక్షకాదరణ పొందిన చిత్రం) అవార్డులను మన తెలుగు సినిమా సొంతం చేసుకుంది. ఇక, ప్రతిష్టాత్మక స్పాట్ లైట్ అవార్డును చరణ్ అందుకున్నాడు. ఈ సందర్భంగా వేదికపై నుంచి చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ స్టేజ్ మీదకు వస్తానని ఊహించలేదని, తన డైరెక్టర్ తోడుగా రమ్మని పిలిస్తేనే స్టేజ్ పైకి వచ్చానని అన్నాడు. ఈ అవార్డు అందుకోవడాన్ని ఎంతో గౌరవంగా, బాధ్యతగా భావిస్తున్నానని, మరిన్ని మంచి చిత్రాలతో అందరినీ అలరిస్తానని చెప్పాడు. ఇక, క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్ బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీ అవార్డుకు తనతోపాటు తన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ నామినేట్ కావడం సంతోషంగా ఉందన్నాడు. నికోలస్ కేజ్, టామ్ క్రూస్, బ్రాడ్ పిట్ వంటి లెజెండ్స్ పక్కన తమ పేర్లు ఉండటం అద్భుతమైన ఫీలింగ్ అని చెప్పాడు.