టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు పోటీపడి నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జక్కన్నతోపాటు ఆ ఇద్దరికీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. భారీ కలెక్షన్లు, హాలీవుడ్ దిగ్గజ దర్శకుల ప్రశంసలు, ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలు, ఆస్కార్ నామినేషన్ లు అందుకున్న ఈ చిత్రం హవా ఇప్పట్లో తగ్గేలా లేదు.
తాజాగా చెర్రీకి జీఎంఏ (గుడ్ మార్నింగ్ అమెరికా) టెలివిజన్ షోలో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ షోలో పాల్గొన్న తొలి తెలుగు నటుడిగా రామ్ చరణ్ చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. చరణ్ ఆ షోలో పాల్గొన్న ఫొటోలు, ఎపిసోడ్ లింక్ ను ట్విటర్ లో షేర్ చేశారు.
‘రామ్ చరణ్ ప్రఖ్యాత గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్నాడు. ఇది తెలుగు సినిమాకే కాదు యావత్ భారతీయ సినిమాకి గర్వకారణం. దర్శకుడు రాజమౌళి మెదడులో పుట్టిన ఒక ఉద్వేగభరితమైన ఆలోచనా శక్తి ప్రపంచాన్ని ఎలా ఆవరించిందో చూస్తే ఆశ్చర్యంగా ఉంది’ అంటూ చిరు ట్వీట్ చేశారు.
మరోవైపు, తాను తండ్రి కాబోతున్న విషయాన్ని ముందుగా ఎన్టీఆర్ కి ఫోన్ చేసి చెప్పానని చరణ్ అన్నారు. తారక్, తాను బెస్ట్ ఫ్రెండ్స్ అని, అన్ని విషయాల గురించి తాము మాట్లాడుకుంటామని చెప్పారు. మెగా కుటుంబంలోకి మరో వ్యక్తి రాబోతున్నందుకు తన తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారని అన్నారు. మరోవైపు, ప్రతిష్ఠాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్ కు ప్రజెంటర్ గా చరణ్ వ్యవహరించనున్నారు.