ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలో టిడిపి కార్యాలయం పై దాడి జరిగిన ఘటన సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలోనే ఈ దాడి జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ, ఎవరో బయటి వాళ్ళు వచ్చి గన్నవరంలో గొడవ చేశారని, తన అనుచరులకు ఈ దాడితో సంబంధం లేదని వంశీ చెప్తున్నారు. గన్నవరంలో జరిగే ప్రతి ఘటనతో తనకు సంబంధం లేదని అంటున్నారు.
తాను ఎవరిపైనా మొదట దాడి చేయనని, కానీ తన జోలికి వస్తే వదలబోనని వార్నింగ్ ఇస్తున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి నేపథ్యంలోనే చలో గన్నవరం కార్యక్రమానికి టిడిపి శ్రేణులు పిలుపునిచ్చాయి. కానీ, గన్నవరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నాయని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా వెల్లడించారు. ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, నిరసనలకు వీలులేదని అంటున్నారు.
గన్నవరం పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ ప్రవేశించకుండా చెక్ పోస్ట్ లు, పికెట్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. అక్రమంగా ప్రవేశించాలని చూస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. టీడీపీ ఆఫీస్ పై జరిగిన దాడి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నామని, సుమోటోగా కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడికి టీడీపీ నేత పట్టాభి పురిగొల్పారని, ఆయన బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలవల్లే శాంతి భద్రతల సమస్య వచ్చిందని అన్నారు. పట్టాభి తొందరపాటు చర్యల వల్లే ఇలా జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు, చలో గన్నవరం కార్యక్రమానికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న టిడిపి నేతలను ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. టిడిపి నేత బుద్ధా వెంకన్న పోలీసులు అడ్డుకున్నారు. మరి కొందరు తెలుగు మహిళలను అరెస్టు చేసిన పోలీసులు వారిని మచిలీపట్నం తరలించారు. మరోవైపు, ఈ కేసులో వల్లభనేని వంశీ అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రామకృష్ణ, మోహనరంగాలపై దొంతు చిన్నా భార్య రాణి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది.
అదే సమయంలో 60 మందికి పైగా టిడిపి నేతలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు కఠినమైన సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టాభితో పాటు మరో పదహారు మంది టిడిపి నేతలపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ కేసులను పోలీసులు నమోదు చేశారు. తమ కార్యాలయంపై దాడి చేసి తమపై పోలీసులు కేసు పెడుతున్నారని టిడిపి నేతలు మండిపడుతున్నారు.