గతంలో జారీ చేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో బలవంతపు ఏకగ్రీవాలు, నామినేషన్ల ఉపసంహరణపై తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. వాటిపై ఫిర్యాదులుంటే….ఆ అభ్యర్థులను పరిగణలోకి తీసుకోవాలని ఎస్ఈసీ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలపై విచారణ అధికారం ఎస్ఈసీకి లేదంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ క్రమంలోనే ఆ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు….ఏకగ్రీవాలైన స్థానాల్లో ఫాం-10 ఇచ్చి ఉంటే వెంటనే డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఏకగ్రీవాలపై దర్యాప్తు జరిపేందుకు వీల్లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎన్నికలు నిలిచిపోయిన చోటి నుంచే మళ్లీ ఎన్నికలు ప్రారంభించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై జనసేన పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
గత నోటిఫికేషన్ నే కొనసాగిస్తున్నారని, దానిని రద్దుచేసి తాజా నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్ పై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు…ఎస్ఈసీకి కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. జనసేన పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను హైకోర్టు ఆదేశించింది. జనసేన అభ్యంతరాల పట్ల అభిప్రాయాలు తెలియజేయాలని ఎస్ఈసీని హైకోర్టు కోరింది. ఈ పిటిషన్ తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.
గతంలో వచ్చిన ఫిర్యాదుల వరకు న్యాయం చేస్తామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చెబుతున్నా ఆయన హామీ అమలవుతుందన్న నమ్మకం తమకు లేదని పవన్ పేర్కొన్నారు. అందుకే తాజా నోటిఫికేషన్ ఇస్తే తప్ప న్యాయం జరగదని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే జనసేన హైకోర్టును ఆశ్రయించింది. మరి, ఈ వ్యవహారంపై మరో వారం రోజుల్లో రిటైర్ కాబోతోన్న నిమ్మగడ్డ స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.