సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న హఠాన్మరణం నందమూరి అభిమానులతో పాటు టీడీపీ అభిమానులను కూడా శోకసంద్రంలో ముంచేసిన సంగతి తెలిసిందే. దాదాపు 24 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న…శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తారకరత్న అంత్యక్రియలను జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు. అంతకుముందు, తారకరత్న భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో ఉంచారు.
మోకిలలోని తారకరత్న నివాసానికి చేరుకున్న బాలకృష్ణ అంబులెన్స్ లో తారకరత్న పార్థివ దేహం వెంట ఉన్నారు. బాలకృష్ణపాటు వైసీపీ నేత, తారకరత్న బంధువు విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. తారకరత్న అంబులెన్స్ వెనక దాదాపు 200 వాహనాలు వచ్చాయి. మధ్యాహ్నం 3:00 వరకు ఫిల్మ్ ఛాంబర్లో తారకరత్న పార్థివ దేహాన్ని నుంచి ఆ తర్వాత మహాప్రస్థానానికి తరలించబోతున్నారు. మరోవైపు తారకరత్న పార్థివదేహాన్ని పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సందర్శిస్తున్నారు.
తారకరత్నతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని ఆయనకు నివాళులర్పిస్తున్నారు. తారకరత్న కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటిస్తూ వారిని ఓదారుస్తున్నారు. అయితే, నందమూరి కుటుంబానికి సన్నిహితులుగా ఉన్న మంచు మోహన్ బాబు, మంచు విష్ణులు తారకరత్న పార్థివదేహాన్ని సందర్శించేందుకు రాలేదు. ఈ విషయంపై తాజాగా మోహన్ బాబు క్లారిటీనిఇచ్చారు. తాను లండన్ లో ఉన్నానని, విష్ణు సింగపూర్ లో ఉన్నాడని అందుకే రాలేకపోయానని మోహన్ బాబు చెప్పారు. అన్నగారైన నందమూరి తారక రామారావు మనవడు తారకరత్న తనకు, తన కుటుంబానికి అత్యంత ఆత్మీయుడని మోహన్ బాబు చెప్పారు.