కొద్దిరోజుల క్రితం హఠాత్తుగా గుండెపోటుకు గురైన సినీ హీరో, టీడీపీ నేత నందమూరి తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే, తారకరత్న మెదడుకు సంబంధించిన వైద్య సేవలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. గుండె పనితీరు కాస్త మెరుగుపడినప్పటికీ మెదడుకు సంబంధించి మాత్రం ఇంకా డాక్టర్లు స్పష్టతనివ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
తారకరత్నకు తాజాగా ఎంఆర్ఐ స్కానింగ్ చేసిన వైద్యులు మెదడులో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నట్టు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తారకరత్నకు మరింత మెరుగైన చికిత్స అందించేందుకు విదేశీ వైద్యులు కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. తారకరత్నకు ఈరోజు అత్యవసర చికిత్స కొనసాగుతోందని ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి సమాచారం అందుకున్న నందమూరి బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు బెంగళూరులో ఆసుపత్రికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నారాయణ హృదయాలయ వైద్యులు నేడు హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉందని, అది విడుదలయ్యాక మరింత సమాచారం అధికారికంగా వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.