తూర్పుగోదావరి జిల్లాలో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొంటున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. బలబద్రపురం వద్ద చంద్రబాబు కాన్వాయ్ కి పోలీస్ బస్సు అడ్డుపెట్టి మరీ రోడ్డుపై బైఠాయించిన పోలీసులు ఆయనను ముందుకు కదలనివ్వలేదు. దీంతో, కాలినడకన 7 కిలోమీటర్ల ప్రయాణించి, సెల్ ఫోన్ లైట్ల వెలుగులో టీడీపీ అధినేత అనపర్తికి చేరుకున్నారు.
ఈ క్రమంలోనే అక్కడ ఏర్పాటు చేసిన రోడ్ షోలో ప్రసంగించిన చంద్రబాబు…వైసీపీ ప్రభుత్వంపై, పోలీసులపై విరుచుకుపడ్డారు. ఒక విచిత్రమైన పరిస్థితిలో అనపర్తి వచ్చానని, అనపర్తి నుంచి సహాయ నిరాకరణ ప్రారంభించానని ప్రభుత్వానికి, పోలీసులకు చంద్రబాబు అల్టిమేటం జారీ చేశారు. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ట్రాక్ రికార్డు తనదని, దానిని ఎవరు బీట్ చేయలేరని చంద్రబాబు అన్నారు.
తానేమైనా పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చానా అని ప్రశ్నించారు. ముందుగా తన పర్యటనకు పోలీసులు అనుమతినిచ్చారని అనుమతి పత్రాలను ప్రజలకు చూపించారు. జగ్గంపేట, పెద్దాపురంలో సహకరించిన వారు అనపర్తిలో అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనపర్తిలో గ్రావెల్ సూర్యనారాయణ అనే ఒకడు ఉన్నాడని. తనతో పెట్టుకోవడం తమాషా అనుకోవద్దని, జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు.
టీడీపీ కార్యకర్తలను కొట్టడం పోలీసులకు మంచిది కాదని ఆయన హెచ్చరించారు. రేపు తన దగ్గర పోలీసులు పని చేయాల్సి ఉంటుందని గుర్తు చేశారు. అక్రమాలు, అన్యాయాలకు పాల్పడిన పోలీసులను వదిలే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. ఆనాడు సైకో ముద్దులు పెడుతూ పాదయాత్ర చేస్తే తాము అడ్డుకోలేదని, వైఎస్ఆర్ పాదయాత్రకు కూడా తాము ఏనాడు ఆటంకాలు సృష్టించలేదని అన్నారు.
తాను సీఎం కావాలనుకోవడం లేదని, ప్రజల కోసమే తన పోరాటమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్ర భావితరాల కోసం తాను పని చేస్తున్నానని, తాను కూడా పారిపోతే ప్రజలను చంపినా దిక్కు లేదని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రసంగిస్తుండగా పోలీసులు ఆయన దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తుంటే వారిని ఆయన హెచ్చరించారు. తన దగ్గరకు రావద్దని, అనుమతి పత్రం ఉందని చూపించారు.
ఈక్రమంలో టీడీపీ కార్యకర్తల మధ్య పోలీసులు చిక్కుకుపోయారు. దీంతో, టిడిపి కార్యకర్తలను పోలీసుల మీద ఒక్క నిమిషం ఉసిగొలిపితే చాలని, కానీ తాను అలా చేయనని అన్నారు. జాగ్రత్తగా ఉండాలని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే పోలీసుల తోపులాటలో టీడీపీ కార్యకర్త ఒకరు సొమ్మసిల్లి పడిపోవడంతో చంద్రబాబు నిప్పులు చెరిగారు. పోలీసులు కొట్టడంతోనే ఆ కార్యకర్తను ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందని, ఈ సైకో జగన్ పోలీసులను కూడా సైకోలుగా మార్చేశారని మండిపడ్డారు.
చంద్రబాబు ఈ విషయం చెబుతుండగానే హఠాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో, అంతా సెల్ ఫోన్లు వెలిగించాలని, తనను అడ్డుకోవడానికి జనరేటర్ ని కూడా ఆపేశారని ఆరోపించారు. చట్టప్రకారం వ్యవహరించి పోలీసులను కూడా బొక్కలో పెడతానని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.