కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పర్యటించారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ప్రసంగించిన చంద్రబాబు…జగన్ పై నిప్పులు చెరిగారు. ఏపీలో సైకో పాలన సాగుతోందని, నాలుగేళ్ల కాలంలో ప్రజలను జగన్ బాధల్లోకి నెట్టేశారని చంద్రబాబు విమర్శించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజాపక్షాన నిలిచేది టీడీపీనే అని స్పష్టం చేశారు. కానీ, జగన్ మాత్రం ప్రజలు కష్టాల్లో ఉంటే ఎంజాయ్ చేస్తున్నారని, ఇది సైకోల లక్షణం అని చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు.
జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, కానీ అధికార యంత్రాంగం, రౌడీలను అడ్డుపెట్టుకొని దానిని బయటకు రానివ్వకుండా జగన్ చూస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రజాభిప్రాయాలను మార్చలేరని, రాబోయే ఎన్నికల్లో జగన్ ఇంటికి పోవడం 1000 శాతం ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యధిక ధరలు ఉన్న రాష్ట్రం ఏపీ అని విమర్శించారు.
పన్నులు, నిత్యావసరాల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా అన్ని ఎక్కువేనని దుయ్యబట్టారు. అధికారం అనే రాయితో ప్రతిపక్షాలను, ప్రజలను జగన్ కొడుతున్నాడని, చివరకు తనను తానే కొట్టుకునే స్థాయికి వచ్చాడని ఎద్దేవా చేశారు. జగన్ ను చూసి పిక్ పాకెట్ గాళ్లు, పేటీఎం బ్యాచ్ మాత్రమే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తారేమో అని సెటైర్లు వేశారు. వైసీపీ అంటే దొంగ మద్యం, జే బ్రాండ్లు, బ్లేడ్ బ్యాచ్ అంటూ చురకలంటించారు.
రాష్ట్రంలో ప్రజలపై 40 రకాల పన్నులు వేసిన ఘనుడు, ఘరానా దొంగ జగన్ మోహన్ రెడ్డి అంటూ పంచ్ లు వేశారు. తమను నమ్ముకున్న ప్రజలు ఇంత నిస్సహాయ స్థితిలో ఉన్నా ఏమీ చేయలేకపోతున్నామని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.